నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ విడుదలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి సీతక్క బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అసెంబ్లీ‌లో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారని గుర్తు చేశారు. అసెంబ్లీ పోడియంలోకి వెళ్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదని, కానీ మా ప్రభుత్వం అలా చేయడం లేదని అన్నారు. గతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్.. ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంగా ఉందని.. బీఆర్ఎస్ నేతల నిరసనలను బట్టే రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పడిందే నియామకాల మీద.. అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ దృష్టి సారించలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్‌లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలకు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్ జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.