రష్యా విషయంలో కీలక పురోగతి సాధించాం

` మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: ట్రంప్‌
` ట్రంప్‌, పుతిన్‌, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న!
` ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు పేర్కొన్న ఆ దేశ మీడియా సంస్థలు
` ఈ సమావేశానికి యూరోపియన్‌ దేశాల నాయకులకూ ఆహ్వానం!
వాషింగ్టన్‌ (జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయిన మరుసటి రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఇందుకు సంబంధించి తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపునకు సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదరకుండానే అలాస్కా సమావేశం ముగిసిన నేపథ్యంలో ట్రంప్‌ తాజా ప్రకటన ఆసక్తిగా మారింది.ఉక్రెయిన్‌కు ‘నాటో’ తరహా భద్రతా గ్యారంటీని అమెరికా, ఐరోపా మిత్రదేశాలు అందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకరించినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ వెల్లడిరచారు. అలాస్కాలో ట్రంప్‌, పుతిన్‌ల మధ్య భేటీలో చర్చించిన అంశాలను తొలిసారి వెల్లడిరచిన ఆయన.. సెక్యూరిటీ గ్యారంటీకి ఇరుదేశాలు అంగీకరించాయన్నారు. చర్చల్లో ఇదే గేమ్‌-ఛేంజర్‌గా మారనుందన్నారు. శాంతి ఒప్పందానికి అవసరమైన అన్ని అంశాలను ప్రస్తావించామన్న విట్‌కాఫ్‌.. ఉక్రెయిన్‌లోని అదనపు భూభాగంలోకి వెళ్లకుండా చట్టబద్ధతతో కూడిన హామీని రష్యా ఇస్తానని చెప్పిందన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్‌ దేశాల నాయకులను కూడా ట్రంప్‌ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య సమావేశం అనంతరం ముగ్గురు నేతల మధ్య (ఆగస్టు 22న) త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ వెల్లడిరచారు. దీంతో యుద్ధం ముగింపునకు సంబంధించి ఆగస్టు 18న కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా.
ట్రంప్‌, పుతిన్‌, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న!
ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలాస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే.అనంతరం త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం గురించి ట్రంప్‌ జెలెన్‌స్కీలో ఫోన్‌లో మాట్లాడుకొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య ఈ సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని ట్రంప్‌ యూరోపియన్‌ నాయకులతో చెప్పినట్లు సమాచారం. మరో వైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ట్రంప్‌తో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్‌ దేశాల నాయకులను కూడా ట్రంప్‌ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ మాట్లాడుతూ.. సోమవారం ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య సమావేశం జరిగిన అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక మీటింగ్‌ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.ఉక్రెయిన్‌తో యుద్ధం గురించి ఇటీవల అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌లు భేటీ అయ్యి రెండున్నర గంటలకు పైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందానికి రాలేదు. అయితే, చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. సమావేశం గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ఒప్పందంపై నిర్ణయం జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఉక్రెయిన్‌ అధినేత తెలిపారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్‌ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు వెల్లడిరచారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదిక అవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరోపియన్‌ నాయకులకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వాషింగ్టన్‌ డీసీలో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశమవ్వనున్న నేపథ్యంలో ఐరోపా నేతలు అప్రమత్తమయ్యారు. గతంలో అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ట్రంప్‌తో స్నేహపూర్వకంగా మెలిగే ఫిన్‌లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ను, ఇతరులను ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి సాయంగా వాషింగ్టన్‌కు పంపనున్నట్లు యూరప్‌ దౌత్యవేత్తలు తెలిపారు. ఇరువురి మధ్య ఘర్షణ పునరావృతం కాకుండా, చర్చలు సజావుగా జరిగేలా వీరు చూసుకోనున్నట్లు సమాచారం. నాటో సెక్రెటరీ జనరల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని పొలిటికో పత్రిక కథనం వెలువరించింది.