యూపీలో మరో నిర్భయ

share on facebook

– అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు..

బదౌన్‌(ఉత్తరప్రదేశ్‌),జనవరి 6(జనంసాక్షి): ఎనిమిదేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ బలైంది. దేవుడి దర్శనానికి వెళ్లిన మహిళలపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. పక్కటెముకలు, కాళ్లు విరగొట్టి.. వ్యక్తిగత అవయవాలను దారుణంగా గాయపర్చారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బదౌన్‌ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఓ 50ఏళ్ల మహిళ ఈ నెల 3వ తేదీ సాయంత్రం దేవుడి దర్శనం కోసం స్థానిక ఆలయానికి వెళ్లింది. ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం ఊరంతా గాలించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆలయ పూజారి మరో ఇద్దరు కలిసి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె కుమారుడు తెలిపారు. ఏమైందని పూజారిని ప్రశ్నించగా.. ఆ మహిళ బావిలో పడిపోయిందని.. ఆమె అరుపులు విని తాము రక్షించిన తీసుకొచ్చినట్లు చెప్పి వెళ్లిపోయారని కుమారుడు వెల్లడించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన ఆ మహిళ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. శవపరీక్షలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమెను తీవ్రంగా గాయపర్చినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. మహిళ పక్కటెముకలు, కాళ్లను విరగ్గొట్టి, ఊపిరితిత్తులపై బలమైన వస్తువుతో గాయపర్చినట్లు వెల్లడైంది. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా దారుణంగా గాయపర్చినట్లు నివేదిక పేర్కొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.

Other News

Comments are closed.