పాండోరా పత్రాలపై కేంద్రం కీలక నిర్ణయం
దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి. అనేక దేశాల్లో బాగా పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలు ‘పాండోరా పత్రాలు’ పేరిట తాజాగా వెలుగులోకి రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాండోరా పత్రాలకు సంబంధించిన కేసులను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సీబీడీటీ) ఆధ్వర్యంలో బహుళ ఏజెన్సీల బృందంతో దర్యాప్తు చేయనున్నట్టు తెలిపింది. ఈ కేసుల దర్యాప్తునకు సీబీడీటీ ఛైర్మన్ నేతృత్వం వహించనుండగా.. ఈడీ, ఆర్‌బీఐ, ఎఫ్‌ఐయూ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. చట్టపరంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోనున్నట్టు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు కొన్ని పేర్లు మాత్రమే విూడియాలో వస్తున్నాయని, ఐసీఐజే వెబ్‌సైట్‌లో కూడా పేర్లను, అన్ని సంస్థల ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని పేర్కొంది. ఐదేళ్ల క్రితం పనామా పేపర్ల పేరుతో జరిగిన ఘటన కన్నా శక్తిమంతమైన పాండోరా పేపర్ల పేరుతో ప్రముఖుల పన్ను ఎగవేత బాగోతాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ జాబితాలో 91 దేశాలకు చెందిన వందలాది ప్రస్తుత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, పలు రంగాల ప్రముఖులు ఉన్నట్టు అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పారిశ్రామికవేత్తలతో పాటు దాదాపు 300 మందికి పైగా భారతీయులే ఉన్నట్టు తెలుస్తోంది. 117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది విలేకర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి ఈ గుట్టును రట్టుచేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది.