మాకు సాయం చేయండి

అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సహకారం లేదు
మాల్దీవ్స్‌ అధ్యక్షుడు ముహమ్మద్‌ ముయిజ్జూ ఆందోళన
ధనిక దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి
మాలె (జనంసాక్షి) : పర్యావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్న మాల్దీవులకు అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సాయం అందడం లేదని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్‌ ముయిజ్జూ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టాలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో పాటు వాటి నుంచి రక్షణ కల్పించేందుకు తమకు ధనిక దేశాలు సహాయం అందించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయి.. కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు తొలి స్థానంలో నిలుస్తుందని ముయిజ్జూ ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక దేశాలు మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవుల లాంటి దేశాలను ఆదుకోవాలని వేడుకున్నారు. పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సమావేశమై అభివృద్ది చర్యలపై ప్రధానంగా చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ముయిజ్జూ కామెంట్స్‌ కు ప్రాధాన్యం సంతరించుకుంది. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే సిడ్స్‌ (ఎస్‌ఐడీఎస్‌) దేశాలకు వస్తోందని మహ్మద్‌ ముయిజ్జూ వెల్లడిరచారు. సముద్ర మట్టాల పెరుగుదలతో కలిగే నష్టాన్నీ భర్తీ చేసుకునేందుకు తమకు 500 మిలియన్‌ డాలర్ల నిధులు కావాలన్నారు. ధనిక దేశాల సాయం లేకుండా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమని మల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూ పేర్కొన్నారు.