అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు

దేశంలో ప్రజలకు దక్కని న్యాయం

పాలకుల ఆలోచనల మేరకు నిర్ణయాలు

న్యూఢిల్లీ,నవంబర్‌27  (జనంసాక్షి) :సంకీర్ణ ప్రభుత్వాల వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదనే ఉద్దేశంతో దేశ ప్రజలు రెండు దశాబ్దాల తర్వాత ఒకే పార్టీకి అంటే బిజెపికి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. మోడీ అధికారంలోకి వస్తే సమస్యలు సమసిపోతాయని భావించారు. అలా అధికారంలోకి వచ్చిన వారు ఈ దేశంలో మౌలిక మార్పు తీసుకువస్తారని అందరూ ఆశించారు. కానీ పేద, మధ్య తరగతి ప్రజానీకం ఇబ్బందులు పడేలా ప్రస్తుత పాలనా విధానాలు ఉన్నాయి. నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికడతామని చెప్పిన వారు అసలు ఆర్థిక పతనాన్‌ఇన చూపించారు. దాని ఫలితంగా దేశంలో వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది నిరుద్యోగులు అయ్యారు. విచిత్రమేమంటే నోట్ల రద్దు తర్వాతే గతంలో కంటే ఎక్కువగా నల్లధనం చెలామణీలోకి వచ్చిందని అధికార గణాంకాలే చెబుతున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పనిహక్కు, ఉపాధి హక్కులన్నీ ఉత్తదే అని రుజువయ్యింది. రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగాన్ని నిందించవద్దని, దాన్ని అమలు చేసే వారిని నిందించాలని అంబేడ్కర్‌ ఆనాడే అన్నారు. రాజ్యాంగం ఆధారంగా ఏర్పాటైన అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారానికి మూలం ప్రజలే అని ఆయన స్పష్టీకరించారు. కానీ ఆయన ఆశలు వమ్మయ్యాయి. అంబేడ్కర్‌ దూరదృష్టితో చేసిన ప్రయత్నాలను తుంగలో తొక్కుతున్నారు. ఆయన ఇగ్రహాలు పెట్టి దండలు వేయడం తప్ప ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లడంలో పాలకులు విఫలమయ్యారు. అంబేడ్కర్‌ను బాగా పొగుడుతున్న బిజెపి కూడా అందరికన్నా ఎక్కువగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటు. ప్రజలను విడిచి పాలనా వ్యవహారాలు సాగిస్తున్నారు. ఈంతో దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిపాలన, స్వీయ అభివృద్ధి అనే లక్ష్యాలను నిర్దేశించుకొని పాలనా వ్యవస్థను భారతీయకరణ చేయాలని అంబేడ్కర్‌ భావించారు. దేశ ప్రజలందరికీ సమానమైన విలువ, గౌరవం హక్కులు ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుందని ఆయన ఆశించారు. దీనికి అనుగుణంగానే ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని రూపొందించారు. నాటి నుంచి రాజ్యాంగంలో అనేక సవరణలు జరిగాయి. ప్రజల సంక్షేమమే ప్రాధాన్యంగా కొన్ని సవరణలు జరిగాయి. అందరికీ ఉచిత నిర్బంధ విద్య, ఉపాధి హావిూ, ఆహార భద్రత, అణగారిన వర్గాలకు హక్కులు, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం వంటివి ఇందులో కీలకమైనవి. రాష్టాఉ బలోపేతం అయితేనే దేశం బలోపేతమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు రాజ్యాంగానికి కొత్త భాష్యాలు చెబుతున్నారు. మెజారిటీ వాదాన్ని వినిపిస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దేశద్రోహులు అనే ముద్ర వేసి కేసులు పెడుతున్నారు. ప్రజా సంక్షేమం సంక్షోభంలోకి నెట్టబడింది. ఆదేశ సూత్రాల ప్రధాన లక్ష్యం రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం. కానీ నయా పాలకుల విధానాలతో ఇవ్వాళ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాని ఫలితం ఏమిటి అన్నది ప్రజలందరికీ అనుభవంలోకి వచ్చింది. కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు. కానీ ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్నారు. కుటీర పరిశ్రమల స్థాపన అన్నది నినాదంగానే మిగిలిపోయింది. ఉన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. అంతిమంగా ప్రజలకు ఉద్యోగ భద్రత కరువైంది. పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు సరైనవి కావని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ కూడా ప్రస్తుత పాలకుల విధానాలను తప్పుపట్టారు. వీటిని సవిూక్షించాల్సిన పాలకులు ఆ పని మాని, విమర్శించినవారిపై తమ అనుయాయుల చేత వ్యక్తిగత విమర్శలు చేయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల గురించి పేర్కొనే సమాఖ్య స్ఫూర్తి ఆచరణలో విఫలమైంది. ప్రణాళిక సంఘం స్థానంలో తెచ్చిన నీతిఆయోగ్‌ స్థాపన సమయంలో వల్లించిన ఆదర్శాలు కానరావడం లేదు. ప్రజాప్రయోజన పథకాలకు తగిన నిధులు కేటాయించాలని చేస్తున్న సిఫార్సులను కేంద్రం పట్టించు కోవడం లేదు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి వ్యక్తుల కేంద్రంగానే రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు కొనసాగుతుండటం ఆందోళనకరం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం వందేళ్లు వెనక్కి వెళ్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70ఏళ్లు అవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో /ూజ్యాంగ లక్ష్యం ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిఫలించడం లేదు. అందరికీ రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు సామాజిక న్యాయం అందించడమే ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం గొప్పదనం ఏమిటి అంటే అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి వీలు లేకుండా ప్రాథమిక సూత్రాలను పొందుపరిచారు. ఉన్నతమైన ప్రజాస్వామిక పరిపాలన దేశానికి అందించాలనే లక్ష్యానికి ఇటీవలి కాలంలో తూట్లు పొడిచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వ్యవస్థలను దెబ్బతీస్తూ కొందరి ఆకాంక్షల కోసం ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకుఅతీంగా లేవు. అంతా కలసి తమవంతుగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు.