అణ్వాయుధాలు ప్రయోగించం 

తేల్చి చెప్పిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించమని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తేల్చి చెప్పారు. భూ, గగనతల మార్గాల ద్వారా యుద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌ విషయంలో పాక్‌ దాగుడుమూతలు ఆడుతోందని, పాక్‌ కవ్వింపు చర్యలు ఎల్లకాలం సాగవని ఆయన పేర్కొన్నారు. పాక్‌ భారత్‌ తో యుద్ధం కోరుకుంటున్నట్టు వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. కశ్మీరీలు పవిత్ర యుద్ధం (జిహాద్‌) చేస్తున్నారని, వారికి పాక్‌ అండగా ఉంటే , వారు విజయం సాధించడం తథ్యమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ భగ్గుమన్నారు. భారత్‌ తో యుద్దానికి దిగితే పాక్‌  కు గట్టి గుణపాఠం చెబుతామని రావత్‌ హెచ్చరించారు. మెరుపుదాడులతో భారత్‌ సత్తా ఏమిటో ఇప్పటికే పాక్‌ కు తెలిసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. భారత అంతర్గత వ్యవహారాల్లో పాక్‌ జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.