అత్యంత కిరాతకంగా సుబోధ్‌కుమార్‌ సింగ్‌ హత్య

వివరాలు వెల్లడించిన ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరి
లక్నో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బులంద్‌షహర్‌ అల్లర్ల సందర్భంగా పోలీసు అధికారి సుబోధ్‌కుమార్‌ సింగ్‌ను దుండగులు అత్యంత కిరాతకంగా చంపినట్టు వెల్లడైంది. బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరి ఈ వివరాలను శనివారం వెల్లడించారు. గోవులను చంపుతున్నారంటూ నిరసనలకు దిగిన గుంపులను చెదర గొట్టేందుకు వెళ్లిన సింగ్‌పై రాళ్లతో కొందరు దాడి చేశారు. రాస్తారోకో కోసం చెట్లను కొడుతుండగా అడ్డుకున్నందుకు దుండగులు ఆయనపై అక్కసు చూపారు. ప్రశాంత్‌ నట్‌ అనే యువకుడు చెట్లను నరికేందుకు తెచ్చిన గొడ్డలితో దాడి చేశాడు. వారిని అదుపు చేసేందుకు సింగ్‌ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నట్‌ ఇన్‌స్పెక్టర్‌ విూద పడి అతని తుపాకీ లాక్కుని అతడినే కాల్చేశాడు. తీవ్రంగా గాయపడిన సింగ్‌ను ఓ కారులో దవాఖానకు తీసుకువెళ్తుండగా ఆందోళనకారులు ఆ కారును కాల్చివేసేందుకు కూడా ప్రయత్నించారు. ఇన్‌స్పెక్టర్‌ను చంపిన కేసులో నట్‌ను మరో నలుగురిని అరెస్టు చేశారు. మొదటగా గొడ్డలితో దాడి చేసిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.