అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను నియమిస్తాం

– త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేస్తాం
– టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాకూటమి పేరిట టీడీపీ, టీజేఎస్‌, సీపీఐలతో కలిసి వెళ్లినా.. ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినా కాంగ్రెస్‌ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కుంతియ తదితరులు భేటీ అయి చర్చించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలోని 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్‌ గాంధీ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ వివరాలను వెల్లడించారు.  తెలంగాణలోని 33జిల్లాలకు వెంటనే డీసీసీ అధ్యక్షులను నియమించాలని రాహుల్‌ ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని మండల, బ్లాక్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయ తీసుకున్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. జనవరి 10వ తేదీలోగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేయాలని రాహుల్‌ గాంధీ ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్ధులే పంచాయతీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ లు గా వ్యవహరించాలని అధిష్ఠానం ఆదేశించిందని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని పూర్తి స్థాయిలో రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయాలని రాహుల్‌ గాంధీ ఆదేశించారని ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రస్తుత ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సైజును తగ్గించి, కొత్తగా 15మందితో కమిటీ ఏర్పాటు చేయడం, లోకసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక పక్రియను ప్రారంభించాలని సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఈవీఎంలతో మాయ చేశారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు పాలన ప్రారంభించలేదని విమర్శించారు. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తాచాటేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెరాసకు పరాభవం తప్పదని ఉత్తమ్‌ పేర్కొన్నారు.