అమితాబ్‌కు అనారోగ్యం 

ఫిలిం ఫెస్టివల్‌కి దూరం
కోల్‌కత్తా,నవంబర్‌9(జనం సాక్షి): బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఈ కారణంగానే ఆయన  నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన 25వ కోల్‌కత్తా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనలేదు.వెస్ట్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ఖాన్‌ ఫెస్టివల్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం ఈ వేడుకకి హాజరయ్యే అమితాబ్‌ బచ్చన్‌ గత రాత్రి నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విూడియాకు తెలిపారు. వైద్యులు ఆయనని పూర్తి విశ్రాంతి తీసుకోమన్న కారణంగా అమితాబ్‌ కార్యక్రమానికి అటెండ్‌ కాలేకపోయారు. అమితాబ్‌ బచ్చన్‌ లేకుండా ఈ ఫిలిం ఫెస్టివల్‌ అసంపూర్ణం అని మమతా పేర్కొన్నారు.
అమితాబ్‌ బచ్చన్‌ కాలేయ సంబంధింత వ్యాధితో అక్టోబర్‌ 15 మంగళవారం తెల్లవారు జామున 3గం.లకి నానావతి ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా అమితాబ్‌ ఆసుపత్రిలోనే ఉన్నారనే సరికి అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు. ఆయనకి ఏమైందో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. రెగ్యులర్‌ చెకప్‌ కోసమే అమితాబ్‌ వచ్చారని వైద్యులు చెప్పడంతో అభిమానులలో ఆందోళన తొలగిపోయింది. శుక్రవారం రాత్రి డిశ్చార్జ్‌ అయిన అమితాబ్‌ని ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, భార్య జయాబచ్చన్‌లు కారులో ఇంటికి తీసుకెళ్ళారు. తన కాలేయం 75 శాతం దెబ్బతిందని ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌ ఓ కార్యక్రమంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాను టీబీ, హెపటైటిస్‌ బి వ్యాధుల నుంచి కోలుకున్నానని కూడా చెప్పారు.