అమిత్‌షా కోలుకుంటున్నారు

– రెండురోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు
– రాజ్యసభ సభ్యులు అనిల్‌ బలూనీ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి17(జ‌నంసాక్షి) : స్వైన్‌ ఫ్లూతో ఆసుపత్రిలో చేరిన భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆ పార్టీ గురువారం వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్‌ అవుతారని భాజపా తెలిపింది. ‘భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కోలుకుంటున్నారని, రేపు లేదా ఎల్లుండి ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని, విూ అభిమానానికి ధన్యవాదాలు’అని భాజపా విూడియా హెడ్‌, రాజ్యసభ సభ్యులు అనిల్‌ బలూనీ తెలిపారు. స్వైన్‌ ఫ్లూతో బాధపడుతూ అమిత్‌ షా బుధవారం ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు. దేవుడి దయ, అందరి అభిమానంతో తాను త్వరగా కోలుకుంటానని పేర్కొన్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులెరియా పర్యవేక్షణలో వైద్యులు అమిత్‌ షాకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన మరో భాజపా నేతకాగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ లాల్‌ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రామ్‌ లాల్‌ను కుటుంబసభ్యులు నోయిడాలోని కైలాశ్‌ ఆసుపత్రిలో చేర్పించారు.
ఏపీలో అమిత్‌ షా పర్యటన రద్దు..
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఏపీలో పర్యటన రద్దయ్యింది. శుక్రవారం కడప జిల్లాలో  అమిత్‌ షా పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటించాల్సి ఉండగా రద్దయ్యింది. అమిత్‌ షా స్వైన్‌ప్లూతో బాధపడుతున్న విషయం విధితమే. దీంతో పర్యటన వాయిదా వేసినట్లు పార్టీ తెలిపింది. కడప పర్యటనకు కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, రాంమాధవ్‌ లు రానున్నారు. శుక్రవారం కడపలో రాయలసీమ జిల్లాల పార్లమెంటరీ స్థాయి ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు.