అమెరికా సైనిక స్థావరానికి ‘రైసిన్‌’ టపా

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ డీసీలోని అనకోస్టియా -బోలింగ్‌ సైనిక స్థావరానికి ఇవాళ ఉదయం ‘రైసిన్‌’ విషం ఉన్న టపా వచ్చిందని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని, నెవడా డెమోక్రాటిక్‌ సెనేటర్‌ హ్యారీ రెయిండ్‌ తెలిపారు. స్థావరంలో రక్షణ నిఘా శాఖ ప్రధాన కార్యాలయానికి ఇది వచ్చిందని, ప్రాథమిక పరీక్షల్లో దీన్ని ‘బయోలాజికల్‌ టాక్సిన్‌’గా గుర్తించామని, ‘రైసిన్‌ ‘ కావచ్చనే అనుమానంతో మరిన్ని పరీక్షలను పంపామని, ఇంతకు మించిన వివరాలు ఏవి తన వద్ద లేవని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా అధ్యక్షుడు ఒబామా, మిస్సిస్సిపి రిపబ్లికన్‌ సెనేటర్‌ రాజర్‌ వీక్ర్‌లకు రైసిన్‌ 2 విషాన్ని పూసిన ఉత్తరాలు పంపాడనే ఆరోపణలపై అరెస్టు ఆయిన పాల్‌ కెవిన్‌ కర్టిన్‌ను ఇవాళ బెయిలుపై విడుదల చేశారు. ఎఫ్‌. బి.ఐ ప్రాథమిక దర్యాప్తులో అతని ఇంటి వద్ద ‘రైసిన్‌’కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకని కారణంగా అతడిని విడుదల చేశారు.