అమేథీ పర్యటనలో రాహుల్‌

స్థానిక కార్యక్రమాలతో బిజీ

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): తన నియోజకవర్గమైన అమేథీలో రెండు రోజలు పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు బుధవారం చేరుకున్నారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అలాగే యుపిలో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు పొత్తు పెట్టుకొని రెండు స్థానాలు మినహాయించి చెరిసగం స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాహుల్‌ నియోజక వర్గమైన అమేథీ, సోనియా గాంధీ నియోజకవర్గమైన రాయబరేలీ స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టమని మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమేథీ చేరుకున్న ఆయన పురస్‌తంగ్‌ గ్రామ పంచాయతీ నేతలతో చర్చిస్తారు. గౌరీగంజ్‌లో నూతనంగా ఎన్నుకున్న బార్‌ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాష్ట్రంలో మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు. అలాగే యూపిలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే పార్టీ శాఖ అందుకు తగ్గట్లుగా వ్యూహాలు సిద్దం చేస్తోంది.