అర్చకులకు పేస్కేల్‌

– ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు

– ధార్మికపరిషత్‌ ఏర్పాటు చేస్తాం

– సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి):దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే నవంబర్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న దూపదీప నైవేధ్యం పథకాన్ని అదనంగా మరో 3 వేల దేవాలయాలకు వర్తింపచేస్తామని ప్రకటించారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్‌ ను ఏర్పాటు చేసినట్లు సిఎం వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అర్చకులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు.మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, టి. హరీష్‌ రావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, తుమ్మల నాగేశ్వర్‌ రావు, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్మీకాంతరావు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్‌, కర్నె ప్రభాకర్‌, శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ శివశంకర్‌, జాయింట్‌ కమిషనర్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. పై మూడు నిర్ణయాలకు సంబంధించిన జీవోలను బ్రాహ్మణ సంఘం నాయకులకు, అర్చకులకు ముఖ్యమంత్రి ఈ సమావేశంలోనే అందించారు. ”స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా దేవాలయాల విూద అతి ఎక్కువ అరాచకం జరిగింది. ప్రభుత్వాలు ఏ దేవాలయానికి ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదు. దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనా, కబ్దాలకు గురైనా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఈ అన్యాయం మరింత ఎక్కువగా జరిగింది. మన గుళ్లను గుళ్లుగా చూడలేదు. మన పుష్కరాలను పుష్కరాలుగా చూడలేదు. మన బతుకును బతుకుగా చూడలేదు. దేవాలయాల అభివృద్దిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దేవాలయాల అభివృద్ది పైనా, అర్చకుల సమస్యలపైనా, బ్రాహ్మణుల సంకేమం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాము. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాము. యాదాద్రి, దర్మపురి, వేములవాడ, భద్రాద్రి తదితర ఆలయాలను ఒక పద్దతి ప్రకారం అభివృద్ధి చేస్తున్నాము. గతంలో కేవలం 1805 దేవాలయాలకు నెలకు. రూ.2500 మాత్రమే దూవదీపు నైవేద్యం క్రింద ఇచ్చేవారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. దూపదీప నైవేద్యం క్రింద ఇప్పటినుండి మరో 3 వేల ఆలయాలకు నెలకు 6 వేల చొప్పున ఇస్తాం. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4805 దేవాలయాలకు దూపదీప నైవేద్యం పథకం వర్తిస్తుంది” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.’అర్చకులకు గౌరవ మర్యాదలు బాగానే లబించినా పూట గడవడమే కష్టంగా ఉంది. గుడిలో పూజలు చేసే అర్చకులకు పిల్లను కూడా ఇవ్వడానికి వెనకాడడంతో పెళ్లిల్లు కాని దుస్థితిలో ఉన్నారు. వారి జీత భత్యాలు ఆలయ కమిటీల విూదనో మరెవరి దయాదాక్షిణ్యాల విూదనే ఆదారపడి ఉంది. ఇప్పటినుండి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్చకులు, ఇతర దేవాలయ ఉద్యోగులకు మొత్తం 5625 మందికి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు అందుతాయి. ఉద్యోగుల స్థాయిని ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు చెల్లిస్తారు. నవంబర్‌ నెల నుంచి పే స్కేల్‌ అమలు చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్పీ అమలు చేసినప్పుడు దేవాలయాల ఉద్యోగుల జీతాలు కూడా సవరిస్తాము’ అని ముఖ్యమంత్రి అర్చకుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.’దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేసే దుస్థితి పోవాలి. అందుకే ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించడానికి ఇకపై దేవాలయాల నిర్వహణ, తదితర వ్యవహారాలన్నీ పర్యవేకించడానికి కొత్తగా ధార్మిక పరిషత్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరిషత్‌ ఆధ్వర్యంలోనే ఇకపై దేవాలయాల నిర్వహణ ఉంటుంది. ఇప్పటికే బ్రాహ్మణుల సంకేమం కోసం వంద కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక బ్రాహ్మణ సంకేమ పరిషత్‌ ఏర్పాటు చేశాము. దీని ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అర్చకులు, బ్రాహ్మణులకున్న ఇబ్బందులు, సమస్యలను పరిషత్‌ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలి” అని ముఖ్యమంత్రి కోరారు.’దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో 83వేల ఎకరాల భూములు దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నట్లు లెక్క ఉంది. ఈ భూమిని రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పొరపాట్లు కాకుండా చూడాలి. అర్చన బాగా చేస్తే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తారు. ఉద్యమ సమయంలో విూరంతా బాగా పూజలు చేసి, ప్రత్యేక రాష్ట్రం రావాలని కో రుకున్నారు. నేను ఏ గుడికి వెళ్లినా మనో వాంఛ ఫలసిద్దిరస్తు, తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవించేవారు. దేవుడు అనుగ్రహించారు. విూ దీవెనలు ఫలించాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు కూడా దేవాలయాల అభివృద్ధి, అర్చకుల సంకేమం, బ్రాహ్మణుల సంకేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. ధార్మిక పరిషత్‌ ను మరింత విస్తృత పరుస్తాం. శృంగేరి పీఠాధిపతులు, చిన జీయర్‌ స్వామి, కంచి పీఠాధిపతుల సలహాలు, సూచనలు పాటించి ధార్మిక పరిషత్‌ కార్యక్రమాలను రూపొందిస్తాం. అర్చకుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇతర ముఖ్య నిర్ణయాలు తీసుకున్న ఈ సమయంలో నాకు 15 లడ్డూలు తిన్నంత ఆనందంగా ఉంది” అని ముఖ్యమంత్రి అన్నారు.