అవును.. నేను కాపలాదారుడినే


– దేశంకోసం రాత్రింబవళ్లు పనిచేస్తా
– నాపై నమ్మకాన్ని ఇలాగే ఉంచి, నన్ను ఆశీర్వదించండి
– దొంగలను ఏదో ఒకరోజు సరైన ప్రదేశానికి పంపిస్తా
– ఉత్తర్‌ప్రదేశ్‌ను మెడికల్‌ హబ్‌గా రూపుదిద్దుతాం
– ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీ
లక్నో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : తనను ‘కాపలాదారుడు’ అంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలు చేస్తుందని.. అది నిజమేనని.. తాను కాపలాదారుడిగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని.. నా జీవితాన్ని దేశ ప్రజలకే అంకిత చేశానని.. దీంతో కొందరు దొంగలకు నిద్రపట్టడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహారాజా సుహేల్‌దేవ్‌ స్మారక స్టాంపులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ‘మహారాజా సుహేల్‌దేవ్‌ సేవలకు చిహ్నంగా నేడు ఈ పోస్టల్‌ స్టాంపులను విడుదల చేశామని అన్నారు. దేశం కోసం పాటుపడిన వారి సేవలను ప్రజలకు గుర్తు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ఘాజీపూర్‌లో శంకుస్థాపన చేసిన వైద్య కళాశాల ద్వారా వైద్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుతాయని ప్రధాని తెలిపారు. వైద్యులు కావాలన్న ఇక్కడి యువత కలలు కూడా ఈ కళాశాల ద్వారా నెరవేరుతాయని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను మెడికల్‌ హబ్‌గా రూపుదిద్దుతాం అని వ్యాఖ్యానించారు. రుణమాఫీల పేరిట రైతులను మోసం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాంటి లాలీపాప్‌ల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. అందుకే తన కాపలా కారణంగా కొందరు దొంగలకు నిద్రపట్టడం లేదని అన్నారు. అయితే దొంగలను వదిలిపెట్టబోనని, వారిని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపిస్తానని వ్యాఖ్యానించారు. పేదలు, రైతుల అభ్యున్నతి కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. ప్రతిపక్షాలు
రుణమాఫీ వంటి లాలీపాప్‌లతో తక్షణ రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్నాయన్నారు. ఎలాంటి హావిూలు ఇస్తున్నారో చూశారా? తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి హావిూలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం కాదని ప్రధాని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్టాల్లో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతు రుణమాఫీలు ప్రకటించిన నేపధ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ లాలీపాప్‌లాంటి రుణమాఫీ ప్రకటన చేసింది. మరి విూ రుణాలు మాఫీ అయ్యాయా? విూ ఖాతాలో డబ్బులు పడ్డాయా? అలాంటి వాళ్లని, వాళ్లు ఇచ్చే లాలీపాప్‌లని విూరు నమ్ముతారా? ప్రజలను మోసం చేస్తున్నది అలాంటి వాళ్లుకాదా?… అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కనీసం స్వామినాథన్‌ సిఫారసులను కూడా అమలు చేయలేదన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన స్వామినాధన్‌ కమిషన్‌ నివేదిక 11 ఏళ్ల క్రితమే అందింది. దాన్ని అమలుచేసి ఉంటే ఇవాళ రుణమాఫీల అవసరమే ఉండేది కాదు. కాబట్టి అలాంటి వాళ్లు చేసే రుణమాఫీ హావిూలతో జాగ్రత్తగా ఉండండని ప్రధాని మోదీ హెచ్చరించారు. రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అన్నారు.  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే ఆయా రాష్టాల్లో కాంగ్రెస్‌ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని మోదీ అన్నారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ నమ్మించి, మభ్యపెట్టిందని విమర్శించారు. 800మంది రైతుల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయన్నారు. ఎంతటి మోసం.. ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ నేతలు చెబుతున్న అసత్యాల పట్ల జాగ్రత్తగాఉండాలన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అప్పుడే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు. యూరియా కోసం బారులు తీరి నిలబడుతున్నారని, హావిూలను నెరవేర్చడానికి బదులు లాలీపాప్‌లు ఇస్తోందన్నారు. ఈ లాలీపాప్‌ సంస్థను విూరు ఎలా నమ్మగలరు? గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ రైతు రుణమాఫీ చేయలేదని మోదీ విమర్శించారు. ఇప్పుడెలా చేయగలదు? విూ కాపలాదారుడు(నేను) రాత్రింబవళ్లు కష్టపడి, నిబద్ధతతో పనిచేస్తున్నాడని, విూరు నాపై నమ్మకాన్ని ఇలాగే ఉంచి, నన్ను ఆశీర్వదించాలని మోదీ కోరారు. దొంగలను ఏదో ఒక రోజు సరైన ప్రదేశానికి (జైలుకి) పంపడానికి విూ నమ్మకమే నాకు బలాన్నిస్తుందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.