అస్తిపంజరాల అక్రమ తరలింపు

వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రైల్వే పోలీసుల

పాట్నా,నవంబర్‌28(జనంసాక్షి): 50 మానవ అస్థిపంజరాలు సహా, మరో 50 మానవ పుర్రెలను రైలులో తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌లోని సారా జిల్లాలోని ఛప్రా రైల్వే స్టేషన్‌లో వీటిని కనుగొన్నారు. నిందితుడిని సంజయ్‌ ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. బలియా-సీల్డా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన వెలుగు చూసింది. ఉత్తర ప్రదేశ్‌లోని బలియా నుంచి భూటాన్‌ విూదుగా

చైనాకు ఈ అస్థిపంజరాలను తీసుకువెళ్తున్నట్లు రైల్వే పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రసాద్‌ మొబైల్‌ ఫోన్‌ను పూర్తిగా స్కాన్‌ చేస్తున్నట్లు, అలాగే అతడిని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై సోనేపూర్‌ రైల్వే డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీసు మాట్లాడుతూ నిందితుడి వద్ద నుంచి భూటాన్‌ కరెన్సీ, కొన్ని ఏటీఎం కార్డులు, నేపాల్‌ దేశస్థుడిగా ఉన్న రెండు గుర్తింపు కార్డులు, నేపాల్‌ సిమ్‌ కార్డు సహా కొన్ని ఫోన్‌ నంబర్లను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2009లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. బస్సులో తరలిస్తున్న 67 మానవ అస్థిపంజరాలను పోలీసులు పట్టుకున్నారు. 2004లో సుమారు 1000 మానవ అస్థిపంజరాలు, వివిధ శరీర భాగాలను గయాలోని ఫాల్గు నది సవిూపంలో స్వాధీనం చేసుకున్నారు. చైనాలో మెడికల్‌ విద్యార్థులకు అస్తిపంజరాల డిమాండ్‌ ఉంది.