ఆగస్టు నెలలో..  బీజేపీకి తీపీ, విషాదం!

– మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయాలకు వేదికైన ఆగస్టు నెల
– ఇదే నెలలో ఇద్దరి సీనియర్‌ నేతల మృతి
న్యూఢిల్లీ,ఆగస్టు24 (జనంసాక్షి) : ఆగష్టు నెల బీజేపీ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండి పోతుంది. రెండో దఫా అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే మోదీ సర్కారు ఆర్టికల్‌ 370 రద్దు లాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో ఇస్తోన్న హావిూని నెరవేర్చిన బీజేపీ మాట నిలబెట్టుకుంది. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు సైతం మోదీ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నుంచి పర్యాటకులను వెనక్కి పంపి, అదనపు బలగాలను లోయలో మోహరించారు. అంతర్జాతీయంగానూ పాకిస్థాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ సమస్యను పరిష్కరించిన ఆనందంలో ఉండగానే సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం బీజేపీ శ్రేణులను కలచి వేసింది. కార్డియాక్‌ అరెస్టుతో కుప్పకూలడానికి గంటన్నర ముందు కూడా ఆమె ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ఐసీజేలో కుల్‌భూషణ్‌ కేసును వాదించిన హారీశ్‌ సాల్వేకు ఫోన్‌ చేసి ఉదయాన్నే వచ్చి ఫీజుగా ఇస్తానన్న ఒక్క రూపాయి తీసుకెళ్లమని కోరారు. ఆగష్టు 6న రాత్రి సమయంలో సుష్మా మరణించగా.. మోదీ తొలి కేబినెట్లో ఆమెతోపాటు కలిసి పని చేసిన అరుణ్‌ జైట్లీ రెండ్రోజుల వ్యవధిలోనే అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం పట్ల బీజేపీ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ, అమిత్‌ షా, అద్వానీ లాంటి కీలక నేతలు హుటాహుటిన ఎయిమ్స్‌కు వెళ్లి రావడంతో.. అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం కూడా విషమించిందని భావించారు. కానీ డాక్టర్లు శక్తిమేరా ప్రయత్నించడంతో ఆయన చికిత్సకు స్పందించారు.
15 రోజులపాటు ఎయిమ్స్‌లో చికిత్స పొందిన జైట్లీ.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఆగష్టు నెల తీపి గుర్తుగా మిగిలిపోతుందని భావించిన బీజేపీ నేతలకు సుష్మా, జైట్లీ మరణాలు చేదు గుళికగా మారాయి. ఒకే నెలలో ఇద్దరు కీలక నేతలు చనిపోవడంతో బీజేపీ శ్రేణులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యాయి. ఇకపోతే ఏడాదిలో బిజెపికి చెందిన ఐదురుగు ప్రముఖనేతలు మృతి చెందారు. వాజ్‌పేయ్‌,అనంతకుమార్‌, మనోహర్‌ పారికర్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ మృతి చెందారు.