ఆత్మవిమర్శకు బిజెపి బహుదూరం
దక్షిణాదిన పాగా వేయాలన్న బిజెపికి పెద్దగా అవకాశాలు కలసి రావడం లేదు. మొన్నటికిమొన్న కర్ణాటకలో అధికారం దక్కకపోగా, ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టింది. తమిళనాట అన్నాడిఎంకెను గుప్పిట్లో పెట్టుకున్నా అది గాలిబుడగలా ఎప్పుడే పేలుతుందో తెలియదు. ఇప్పుడక్కడ డిఎంకె బాగా బలపడింది. దీనికితోడు ఇప్పుడు చంద్రబాబు మళ్లీ రాజకీయచక్రం తిప్పడంతో విపక్ష పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి. దీంతో కర్నాటక, తమిళనాడుల్లో ఎన్‌డిఎ వ్యతిరేక కూటమి బలపడే సూచనలు ఉన్నాయి.ఇకపోతే శబరిమల వివాదంలో కేరళలో పాగా వేయాలన్నది కూడా బిజెపి మాస్టర్ ప్లాన్. ఓవైపు సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలను రెచ్చగొడుతోంది. ఇక తెలంగాణలో గతంలో ఉన్నపాటి ఛరిష్మా కూడా లేదు. ఈ ఎన్నికల్లో మాదే అధికారం అంటున్న బిజెపి నేతలు నేలవిడిచి సాము చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగు తోందన్న చర్చ బిజెపిలో జరగడం లేదన్నది గమనించాలి. నిజానికి ప్రజల్లో మంచి పేరు తెచ్చు కోవడం అన్నది పాలనతో ముడిపడివుంది. మంచిపాలన అందిస్తే కోరకుండానే పార్టీని ప్రజలు అందలం ఎక్కిస్తారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నా అవన్నీ గాలి బుడగలని తేలిపోయింది. గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన కొన్నాళ్లకే మోడీ అసలు రూపం బయటపడింది. ఏకఛత్రాధిపత్యంతో బిజెపిలో నిరంకుశ విధానాలకు తెరతీసారు. అలాగే ప్రాంతీయపార్టీ స్థాయికి బిజెపిని దిగజార్చారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. కేవలం వ్యక్తి పొగడ్తలకు ప్రాధాన్యం పెరిగింది. బిజెపి మూల సిద్దాంతాలను మోడీ పూర్తిగా తుంగలో తొక్కారు. ఓ చాయ్‌వాలా ప్రధాని అయితే ప్రజల సమస్యలు బాగా తెలిసి ఉంటాయను కున్నారు. కానీ ఆయనకు కార్పోరేట్ సమస్యలు తప్ప ప్రజలు పట్టడం లేదు. పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని వైనం ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది. దీనికితోడు మోడీ వస్తే ఏదో చేస్తారన్న ఆశలు ఉడిగిపోయాయి. దాదాపుగా అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిన ప్రధాని మోడీ గత నాలుగున్న రేళ్లుగా కేవలం కార్పోరేట్ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకుంటున్నారన్న భావన బలపడింది. అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అని చెబుతున్న నోట్లరద్దు,జిఎస్టీ వల్ల ప్రయోజనాలు లేకపోగా అదనపు భారం పడడంతో ప్రజలు మండిపడు తున్నారు. తాజాగా ఇప్పుడు ఉత్తరాదిలో జరుగుతున్న ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి భంగపాటు తప్పదని సర్వేలు చెబుతున్నాయి. జిఎస్టీ,పెట్రో ధరలు, గ్యాస్ ధరల పెరగుదల, నిత్యావసరాల ధరలు ఇలా అన్నింటా పెరుగుదల తప్ప మరోటి కానరావడం లేదు. అందుకే ప్రజలు బాహాటంగా ఎక్కడ చూసినా బిజెపి అంటేనే చిరాకు పడుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఏదో పొడుస్తారని అనుకున్నాం… దాని రంగూ తేలిపోయిందన్న విమర్శ ఇప్పుడు సర్వత్రా సర్వసాధారణం అయ్యింది. ఈ దశలో దక్షిణాదిలో పాగా వేద్దామనుకుంటే పరిస్థితులు అనుకూలంగా లేవనే చెప్పాలి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. ఎపిలో చేస్తున్న ఫీట్లు, కుయుక్తులు ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇదంతా చంద్రబాబునాయుడిని ఇబ్బందిపెట్టే కార్యక్రమంగానే ప్రజలు చూస్తున్నారు. నిజానికి విభజన హావిూల్లో గట్టిగా ఏ ఒక్కటి అమలు చేయకుండా అక్కడి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. అలాగని తెలంగాణకు కూడా ఒరగబెట్టిందేవిూ లేదు. ఇవన్నీ పక్కనపెట్టి ఎపిలో టిడిపిని దెబ్బ కొట్టాలనుకునే ప్లాన్ అమలులో నేతలు బిజీగా ఉన్నారు. అయితే ఇది కానిపనని బిజెపి గుర్తించి ముందుకు సాగితే మంచిది. ఎపిలో విభజన హావిూలను అమలు చేయకపోవడం, సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో కలసిరావడం లేదు. తెలంగాణలో విభజనకు పూర్వం మాత్రమే
బిజెపికి అంతోఇంతో బలం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. బిజెపితో లాభం లేదనుకుంటున్న వారు తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. బిజెపిలో ఉన్నవారు సైతం రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో ఉన్న ఐదు అసెంబ్లీ సీట్లు కూడా గెల్చుకోవడం కష్టంగానే ఉంది. అధికారం కోసం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో సైద్ధాంతికంగా బీజేపీ రాజీపడింది. దాని మూలాలను విస్మరించింది. అయినా ప్రజలకు మేలు చేస్తోందా అంటే అదీ లేదు. అటు ప్రజలకు మేలు చేయకపోగా, బురద రాజకీయాలను నడపడం వల్ల మోడీ ప్రభ మసకబారిందే తప్ప బిజెపికి కలసి రాలేదు. బహుశా బిజెపి ఇప్పుడు బద్‌నామ్ అయినంతగా గతంలో ఎప్పుడూ కాలేదు. దక్షిణాది చైతన్యానికి, ద్రవిడ ఆత్మాభిమానానికి నెలవు అయిన తమిళనాడులో కేందప్రభుత్వ జోక్యంతో అక్కడి ప్రజలూ విసిగిపోయారు. ఈ దశలో డిఎంకె ఎన్‌డిఎ వ్యతిరేక కూటమిలో చేరడం కారణంగా తమిళనాట బీజేపీ ఆశలకు గండిపడినట్లే. కేంద్ర వ్యతిరేకతను ఆసరా చేసుకుని కొత్తగా రాజకీయ శక్తులు పుట్టుకు వస్తున్నాయనడానికి ఎపి, తమిళ రాజకీయాలే నిదర్శనం. అవినీతిపై యుద్ధం చేస్తానన్న ప్రధానమంత్రి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. సాంప్రదాయకంగా బీజేపీకి అనువు గాని చోట్ల కూడా పాగా వేసి తీరతామని ఆ పార్టీ అధ్యక్షులు అమిత్ షా చేసిన ప్రతిజ్ఞలు వీగిపోగా, ఇప్పుడు దాన, దండోపాయాలకు దిగవలసి రావడం సర్వత్రా విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. ప్రజల్లో గూడుకట్టుకున్న అసహనం, అసంతృప్తి, పాలనా వైఫల్యాలపై బిజెపి ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు సాగకపోతే ఆ పార్టీ దక్షిణాదిలో పాగావేయడం అటుంచి, ఉన్న రాష్ట్రాల్లో కూడా ఊడ్చిపెట్టుకుని పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు ఇప్పుడు అధికారంలో ఉన్న రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉదాహరణ కాబోతున్నాయి.