ఆదరాబాదరాగా సాగుచట్టాల రద్దు

చర్చకు అవకాశం ఇవ్వకుండానే ఉభయసభల ఆమోదం

చట్టాల ఆవశ్యకతపై సమాధానం ఇచ్చుకోలేక పోయిన సర్కార్‌

న్యూఢల్లీి,నవంబర్‌29( జనంసాక్షి) ):  వివాదాస్పద సాగు చట్టాల రద్దు విషయంలో కూడా మోదీ ప్రభుత్వం గతంలో అనుసరించిన బుల్‌డోజ్‌  వైఖరినే అవలంబించింది. చట్టాలను రూపొందించినప్పుడు పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ లేకుండానే ఇరు సభల ఆమోదం తీసుకున్నారు. తాజాగా ఆ చట్టాలను రద్దు చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే చట్టాల రద్దును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. అయితే ఎలాంటి చర్చ చేయకుండానే ఓటింగ్‌ నిర్వహించి రద్దుకు ఇరు సభల ఆమోదం పొందారు. చర్చకోసం సభ్యులు పట్టుబట్టినా దానికి స్పీకర్‌ అంగీకరించలేదు. అలాగే రైతులకు మేలు చేస్తామని, మద్దతు ధరలు ప్రకటిస్తామని చెప్పినా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. గత ఏడాది ఆగస్టులో సాగు చట్టాల బిల్లును లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పుడు ఎలాంటి చర్చ లేకుండా ఓటింగ్‌ నిర్వహించి ప్రభుత్వం తన పట్టును నెగ్గించుకుంది. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్విరామ ఆందోళన చేపట్టారు. 2020 నవంబర్‌ 26న దేశ రాజధాని ఢల్లీి సరిహద్దులో చేపట్టిన ఆందోళన ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. మధ్యలో ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ వివాదాస్పంగా మారింది. అయినప్పటికీ రైతులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. మూడు సాగు చట్టాల్ని రద్దు చేస్తామని నవంబర్‌ 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హావిూ ఇచ్చారు. అంతే కాకుండా రైతులను అర్థం చేసుకోవడం లో విఫలమయ్యామని క్షమాపణలు చెప్పారు. అయితే సాగు చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు.. తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సాగుచట్టాల లక్ష్యాన్ని వివరించలేకపోయామని చెప్పిన ప్రధాని రద్దు సమయంలో అయినా చర్చించి ప్రజలకు తెలియ చేసి ఉంటే ఆయన నిజాయితీ తెలిసేది. అయితే అలా చేయకపోవడం ద్వారా రైతుల అనుమానాలు నిజమయ్యాయి. ప్రభుత్వానికి రైతులపట్ల నిజాయితీ లేదని రుజువు చేసుకున్నారు. చర్చ చేసివుంటే ప్రభుత్వానికి తగిన అవకాశం లభించేది. ఆందోళనచేస్తున్న రైతులకు సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉండేది.