ఆమ్‌ఆద్మీ పార్టీకి అల్కాలాంబ గుడ్‌బై…!

– పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ట్వీట్‌
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఆమాద్మీ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే అల్కాలాంబ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమ్‌ఆద్మీ పార్టీతో ఆరేళ్ల తన ప్రయాణం చాలా నేర్పించిందని ఆమె పేర్కొన్నారు. పార్టీ ప్రాధమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆప్‌కి గుడ్‌బై చెప్పేందుకు, పార్టీ ప్రాధమిక సభ్యుత్వానికి రాజీనామా చేసేందుకు సమయం ఆసన్నమైందని, గత ఆరేళ్ల నా ప్రయాణం చాలా విషయాలను నేర్పించిందన్నారు. అందరికీ ధన్యవాదాలు.. అని అల్కాలాంబ ట్వీట్‌ చేశారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే అల్కాలాంబ రాజీనామా తెరవిూదికి రావడం గమనార్హం. కాంగ్రెస్‌ పార్టీ మాజీ సభ్యురాలైన ఆమె.. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఫోటో దిగడం చర్చనీయాంశమైంది. ఆమె ఆమాద్మీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరతారంటూ సంకేతాలిచ్చిన్టటైంది. అయితే ఆదివారమే తన రాజీనామాపై ట్విటర్లో స్పందించిన అల్కాలాంబ.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం చాందినీ చౌక్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆమె.. తన నియోజకవర్గంలోని ప్రజలతో ‘జన సభ’ నిర్వహించిన అనంతరం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.  పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొంతకాలం నుంచి బహిరంగంగానే ఆమె విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.