ఆరోగ్యం సహకరించడం లేదు..  భారత్‌కు రాలేను 


– వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా దర్యాప్తుకు సహకరిస్తా
– పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్‌ ఛోక్సీ
న్యూఢిల్లీ, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ప్రయాణాలు చేయలేనని, భారత్‌ను రావడానికి తన ఆరోగ్యం సహకరించదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్‌ ఛోక్సీ తెలిపారు. ఛోక్సీని స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. పీఎన్‌బీ కుంభకోణం కేసులో ఛోక్సీని ‘పలాయన ఆర్థిక నేరగాడి’గా ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ ఛోక్సీ న్యాయస్థానానికి లేఖ రాశారు. అయితే తాను మాత్రం భారత్‌కు వచ్చే ప్రసక్తే లేదని ఛోక్సీ పదే పదే చెబుతున్నారు. తాజాగా న్యాయస్థానానికి రాసిన లేఖలోనూ ఛోక్సీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆరోగ్య కారణాల రీత్యా ప్రయాణం చేయలేనని, అందుకే భారత్‌కు రాలేనని చెప్పారు. రుణాల సమస్యను పరిష్కరించుకునేందుకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని కోర్టుకు చెప్పకుండా ఈడీ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.  యాంటిగ్వా నుంచి భారత్‌కు వచ్చేందుకు 41 గంటల విమాన ప్రయాణాన్ని తాను భరించలేనని, అందుకు తన ఆరోగ్యం కూడా సహకరించదని ఛోక్సీ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక.. భారత్‌లో దర్యాప్తు సంస్థల తీరును కూడా ఛోక్సీ విమర్శించారు. అక్కడ కేసుల విచారణ నత్తనడకలా సాగుతుందని ఎద్దేవా చేశారు. అవసరమైతే  తాను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా దర్యాప్తుకు సహకరిస్తానని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం వెలుగుచూసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువైన మెహుల్‌ ఛోక్సీని ప్రధాన నిందితులుగా గుర్తించారు. అయితే అప్పటికే వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఛోక్సీ యాంటిగ్వాలో ఉన్నారు. అక్కడే పౌరసత్వం కూడా తీసుకున్నారు. ఇటీవలే ఛోక్సీపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేసింది.