ఆర్‌బిఐ బలోపేతంతోనే సమస్యలకు చెక్
రిజర్వ్ బ్యాంక్‌ను నిర్వీర్యం చేయకముందే ఎగవేతదారులు ఎలా ఎగిరిపోయారో చశాం. వేలకోట్లు సొమ్ములు రుణాలుగా పొందిన వారు ఎగిరిపోయారు. సామాన్యులు మాత్రం వేయి రూపాయల అప్పున్నా వారిని సిబిల్ పేరుతో వేధిస్తున్నారు. వారికి కనీస రుణం అందకుండా సిబిల్ అడ్డుపడుతోంది. సిబిల్ ఇప్పుడో బ్రహ్మపదార్థంగా మారింది. అది ఎలా ఉంటుందో..ఎక్కడ ఉంటుందో అన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై యుద్దం చేసి దాని పనితీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాదు..రుణాలు అన్నవి సామాన్యులకు కాకుండా ఎగవేతదారులకు ఈజీ వేగా మారింది. వీటిని సంస్కరించి ఆర్‌బిఐని బలోపేతం చేయాలి. చీమచిటుక్కుమన్నా తెలుసుకునేలా ఆర్‌బిఐ బలపడాలి. ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్‌ను బలోపేతం చేస్తే తప్ప సాధ్యం కాదు. చరిత్రలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ప్రయోగించినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య ఉన్న పొరపొచ్చాలను తొలగించుకోనున్నట్లు తెలిపింది. ఆర్‌బీఐకి స్వయంప్రతిపత్తి అవసరమేనని.. అయితే ఆర్థిక వ్యవస్థ అవసరాలు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ కార్యకలాపాలు సాగాలని ఆర్థిక శాఖ పేర్కొంటున్నది. ఎక్కడా.. సెక్షన్ 7 కింద ఆర్‌బీఐకి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించకుండానే ఆర్థికశాఖ ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఆర్‌బీఐపై ప్రభుత్వం సెక్షన్ 7ను ప్రయోగించిందా లేదా అన్నది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్‌బీఐ పర్యవేక్షణ సక్రమంగా లేదన్న విషయంలో ఆర్‌బీఐకి, ప్రభుత్వానికి మధ్య ఇటీవల పొరపొచ్చాలు వచ్చాయి. ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి తప్పనిసరని ఆర్థిక శాఖ ప్రకటించడం ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన మలుపుగా బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐతో విభేదాలు తారస్థాయికి చేరాయని ప్రచారం జోరుగా సాగుతుం డటంతో, దీనికి ముగింపు పలకాలని ప్రభుత్వం భావించినట్లు, ఆర్‌బీఐ విూద తాను పెత్తనం చేయాలను కుంటున్నాననే అభిప్రాయం బలపడకూడదని అనుకుంటున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది. అందువల్ల పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయని అంటున్నారు. బ్యాంకులు విచ్చలవిడిగా రుణాలు ఇచ్చి మునిగిపోతుంటే రిజర్వుబ్యాంకు కళ్ళుమూసుకుందనీ, మొండి బకాయీలతో బ్యాంకులు దెబ్బతిని పోవడానికి కారణమని జైట్లీ మండిపడ్డారు. నిరర్థక ఆస్తులు పెరగడం ఎప్పటినుంచో వస్తోంది. ఆర్థిక శాఖ బాగా పనిచేస్తుందనుకున్నప్పుడు , దానిని చక్కదిద్దడానికి ప్రయత్నించిన గత ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ గవర్నర్ పదవి వదిలిపోయేవారు కాదు. నిజానికి ఇది సక్రమంగా ఉండి, ప్రబుత్వ జోక్యం లేకుంటే ఇలాంటి అవాంతరాలు వచ్చేవి కావు. రుణాలు ఎగవేసి ఏం చక్కా ఎగిరిపోవచ్చన్న ధోరణి బలపడకుండా మోడీ ప్రభుత్వ తీసుకున్న చర్యలు శూన్యం. దీంతో ఎగవేతదారులు విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నారు. ఆర్బీఐని స్వతంత్రంగా పనిచేసుకోనివ్వండి అంటూ రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాళ్ ఆచార్య ఘాటుగా స్పందించిన వెంటనే దాని ఉద్యోగుల సంఘం అంతకంటే ఘాటైన పదజాలంతో ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాయడం జైట్లీ ప్రతివిమర్శకు కారణం. రిజర్వుబ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరుకున్నాయో ఈ పరిణామాలు తెలియచెబుతున్నాయి. ఆర్థిక వృద్ధిని కృత్రిమంగా పెంచేందుకు భారీ రుణాలిమ్మంటూ గత పాలకులు బ్యాంకులపై ఒత్తిడితెచ్చారనే వాదనలూ ఉన్నాయి. పాలకులు ఒత్తిడి తెస్తే, బ్యాంకులు ఇస్తే రిజర్వుబ్యాంకు ఎందుకు అడ్డుపడలేదన్నది ప్రశ్న. కీలకమైన ఆర్థిక నిర్ణయాల్లో ప్రభుత్వానికీ, బ్యాంకుకూ మధ్య విభేదాలు పొడచూపడం, ప్రభుత్వం ఒత్తిడి తేవడం, బ్యాంకు కాదనడం గతంలోనూ జరిగింది. బీజేపీ ప్రభుత్వం రాకతో ఆర్‌బిఐ బలపడేబదులుగా కుంచించుకు
పోయింది. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళించేందుకు, ప్రభుత్వరంగ బ్యాంకులను నియంత్రించేందుకు, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాలని విరాళ్ ఆచార్య కోరుతున్న దానిలో తప్పేవిూ లేదు. ఆర్బీఐని బలోపేతం చేయడం, స్వేచ్ఛగా పనిచేయనివ్వడం వల్ల ఆర్థిక నేరాలను అరికట్టవచ్చు. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయవచ్చు.మరోవైపు మోదీ స్వయంగా తెచ్చిపెట్టిన ఉర్జీత్ పటేల్ కూడా ఇటీవల ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగానే ఉన్నారు. రిజర్వుబ్యాంకు బోర్డులో పరివార్ మనిషి గురుమూర్తిని పార్ట్‌టైమ్ డైరక్టర్‌గా నియమించడంతో నిప్పురాజుకుంది. మోదీ మనిషిగా గురుమూర్తి అతిజోక్యం బ్యాంకులో అందరినీ బాధిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో నిబంధనలను బాగా సడలించి చిన్నతరహా పరిశ్రమలకు భూరిగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు రిజర్వుబ్యాంకుతో సంబంధం లేకుండా మోదీ ఏకపక్షంగా తీసుకున్న పెద్దనోట్ల నిర్ణయం వేలాది చిన్నపరిశ్రమలను దెబ్బకొట్టి, లక్షలాదిమంది ఉపాధిని మాయం చేసింది. పదివేలయినా సరే సామాన్యుడిని ముక్కుపిండి వసూళ్లకు తెగబడ్డ బ్యాంకులు ఇన్నాళ్లూ పెద్దల జోలికి వెళ్లకుండా, వారు వందలు, వేలకోట్లు ఎగవేసినా మిన్నకుండిపోవడం వల్ల్నే బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. ఇవన్నీ కూడా సామాన్యుల కష్టార్జితం కాక మరోటి కాదు. లక్షల్లో పేరుకుపోయిన అప్పులకు సామాన్యులను బలిచేసి సవాలక్ష ఆంక్షలతో ఇన్నాళ్లూ వేధిస్తూ వచ్చాయి. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని సామాన్యులు బ్యాంకులకు వెళ్లడమే బహుకష్టంగా మారింది. ఉన్న ఎటిఎంలను పనిచేయకుండా చేసిన ఘనత మన ప్రధాని మోడీది. ఇదే అదనుగా బ్యాంకులు అత్యుత్సాహంతో ఖాతాదారులపై ఇష్టారనీతిన ఛార్జీలను మోపుతున్నాయి. రుణాలను ఎగవేసిన వారు కేంద్రమంత్రులుగా, రాష్ట్రమంత్రులగా చలామణి
అవుతున్నా పట్టించుకోని వైనం మన ఘన ప్రజాస్వామ్యం సాధించింది. ఇవన్నీ చక్కబడాలంటే ఆర్‌బిఐని బలోపేతం చేసి, ప్రభుత్వం తన జోక్యం లేకుండా దానిని జవాబుదారీ సంస్థగా చేయాలి.