ఆలయంలోకి వెళ్లింది మహిళా మావోయిస్టులే

– బీజేపీ ఎంపీ వి. మురళీధరన్‌
న్యూఢిల్లీ, జనవరి3(జ‌నంసాక్షి) : బుధవారం శబరిమల ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న ఇద్దరు మహిళలు మావోయిస్టులేనని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ వి. మురళీధరన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నిన్న శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న ఆ ఇద్దరూ మహిళా ‘మావోయిస్టులేనని’ ఆయన వ్యాఖ్యానించారు. ‘నిన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు మహిళలు భక్తులు కాదని,  వాళ్లు మావోయిస్టులు, నక్సలైట్లు. ఎంపిక చేసుకున్న కొందరు పోలీసులతో సీపీఎం దీనికి ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఆ మహిళలు ఆలయంలోకి ప్రవేశించేలా సహకరించిందని, కేరళ ప్రభుత్వం, సీఎం పినరయి విజయన్‌, సీపీఎం పార్టీలతో మావోయిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హిందూఆలయం, స్వామి అయ్యప్ప భక్తులకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని మురళీధరన్‌ ఆరోపించారు. కేరళలోని హిందూ ఆలయాలపై ఇది బహిరంగ దాడి అని, కేరళతో పాటు దేశం మొత్తానికి ఇది చీకటిరోజు అని ఆయన  పేర్కొన్నారు. కాగా 40 ఏళ్ల మహిళలు బిందు, కనకదుర్గ నిన్నశబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేరళ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. శబరిమల కర్మ సమితి సహా పలు హిందూత్వ సంస్థలు ఇవాళ చేపట్టిన రాష్ట్ర బంద్‌ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు పోలీసు వాహనాలతో పాటు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. పోలీసులపైనా దాడులకు దిగుతుండడంతో కేరళలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ప్రస్తుతం ఎంపీ వ్యాఖ్యలతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.