ఆవుపాల ధర పెంచిన మదర్‌ డెయిరీ

– లీటర్‌కు రూ. 2చొప్పున పెంపు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :   ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్‌ డెయిరీ తాజాగా పాల ధరను పెంచింది. లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచింది. దీంతో లీటరు ఆవు పాల ధర రూ.44కు చేరింది. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఈ ధర వర్తిస్తుంది. శుక్రవారం నుంచే ధర పెంపు అమలులోకి వచ్చింది.
రైతుల వద్ద నుంచి పాల సేకరణకు ఖర్చు పెరిగిపోవడంతో పాల ధర పెంచుతున్నట్లు మదర్‌ డెయిరీ తెలిపింది. ఇకపోతే ఇరత రకాల పాల ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగతాయని కంపెనీ తెలిపింది. ధరలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. గత రెండు నుంచి మూడు నెలల కాలంలో ఆవు పాల సేకరణ వ్యయం లీటరుకు రూ.2.5 నుంచి రూ.3 వరకు పెరిగిందని మదర్‌ డెయిరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందుకే పాల ధర పెంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ‘పాల ధర పెంపు నిర్ణయం సెప్టెంబర్‌ 6 నుంచి అమలులోకి వచ్చింది. అర్ద లీటరు ప్యాకెట్‌ ధర రూ.23గా ఉంది. ఇక లీటరు ప్యాకెట్‌ ధర రూ.44. ఇకపోతే ఇతర పాల ప్యాకెట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన వివరించారు. మదర్‌ డెయిరీ ఆవు పాల ధరను పెంచడంతో ఇతర పాల సరఫరా కంపెనీలైన అమూల్‌, పరాగ్‌ మిల్క్‌ వంటి కంపెనీలు కూడా పాల ధరను పెంచే అవకాశముందన్నారు. ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మదర్‌ డెయిరీ దాదాపు 30లక్షల టన్నుల పాలను సరఫరా చేస్తోంది. ఇందులో 8లక్షల లీటర్లు ఆవుపాలు ఉన్నాయి. మదర్‌ డెయిరీ ఈ ఏడాది మే నెలలో కూడా పాల ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచింది. అయితే అప్పుడు లీటరు ఆవు పాల ధర మాత్రం పెరగలేదు. అర లీటరు ప్యాకెట్‌ ధర రూ.1 మేర పైకి కదిలింది.