ఆ పదిహేను నిముషాలు.. అనుకున్నట్లుగానే టెన్షన్‌ పెట్టింది

లేకుంటే చరిత్ర సృష్టించే వాళ్లం
బెంగళూరు,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   ఒకవేళ విక్రమ్‌ చంద్రునిపైకి చేరివుంటే ఇది దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచివుండేది. కానీ చివిరినిముషంలో అంతా తారుమారయ్యింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ కట్‌ అయ్యాయి. చంద్రుడికి 2.1 కిలో విూటర్ల దూరంలో
ఉండగా సంకేతాలు తెగిపోయాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన శ్రాస్త్రవేత్తలు డాటాను విశ్లేషించే పనిలోపడ్డారు. విక్రమ్‌ ల్యాండర్‌ క్రాష్‌ అయ్యిందా? అన్నది కూడా తెలసుకునే ప్రయత్నంలో ఉన్నారు.  ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. దీనిని తాము నిర్దారించలేమన్నారు. సుమారు 47 రోజుల ప్రయాణం అనంతరం విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సిగ్నల్స్‌ తెగిపోయాయి. కాగా విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిలోని దక్షిణ ధృవంలో దిగేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయోగంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. విక్రమ్‌ ల్యాండింగ్‌లో చివరి పావుగంటను 15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌ అని ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ అన్నప్పుడు చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. శుక్రవారం రాత్రి ఆ భయం ఎలా ఉంటుందో భారతీయులందరికీ అర్థమైంది. ల్యాండింగ్‌ చివరి దశ దాకా అంతా సజావుగా జరిగినట్టు కనిపించినా.. చివర్లో సంకేతాలు ఆగిపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌లో ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ ఆందోళనతో అటూ ఇటూ తిరుగడం మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. దీంతో.. టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది భారతీయుల్లో ఆందోళన! ఏమయింది? ఏం జరుగుతోంది? విక్రమ్‌ సజావుగా ల్యాండయిందా? లేక అనుకోనిది జరిగిందా? అనే భయం! అటు చూస్తే శాస్త్రజ్ఞుల ముఖాల్లో ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ. ఇంతలో ప్రధాని వచ్చి శివన్‌, ఇతర శాస్త్రవేత్తల భుజం తట్టి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి విూడియాతో మాట్లాడారు. దీంతో ఇది సజావుగా సాగలేదన్నది అర్థం అయ్యింది.