ఇంకెన్నాళ్లీ దమనకాండ..?

– గౌరీ లంకేష్‌ దారుణ హత్యపై పెల్లుబీకుతున్న నిరసన

బెంగళూరు,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): బెంవగళూరు లాంటి మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి గౌరీ లంకేశ్‌ను కాల్చిచంపగలిగారంటే ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన తీరులో పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. హత్యలు చేస్తే శిక్ష అనుభవిస్తామన్న భయం లేకపోవడం వల్లనే ఇవాళ సంఘవ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయి. గౌరి హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆమె సోదరుడు కోరుతున్నా, అందుకు ప్రభుత్వాలు ముందుకు వస్తాయన్న నమ్మకం లేదు. దేశంలో ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరు నేర రాజధానిగా మారుతోంది. ఒకరిని హతమార్చాలని గట్టి పట్టుదలతో ప్రయత్నించే హంతకుల నుంచి పౌరులను రక్షించడం ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ హత్య జరిగిన తర్వాత సంవత్సరాలు గడిచినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలకపోవడం, హంతకులను పట్టుకోలేకపోవడం వల్ల చట్టం పట్ల భయం తగ్గిపోతుంది. నేరం చేసినవారికి శిక్ష పడకపోతే నేరాలు పెరుగుతాయి. కర్ణాటక పోలీసుల దర్యాప్తు పట్ల విశ్వాసం లేకనే తన సోదరి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ గౌరీ సోదరుడు కోరాడు. అసాంఘిక శక్తులే గతంలో మహారాష్ట్రలో గోవింద్‌ పన్సారే, డాక్టర్‌ నరేంద్ర దభోల్కర్‌లను పొట్టనబెట్టుకున్నాయి. ఇలాంటి శక్తులే రెండేళ్లక్రితం కర్ణాటకలో ప్రముఖ సాహితీవేత్త, హేతువాది డాక్టర్‌ కల్బుర్గిని కాల్చిచంపాయి. ప్రభుత్వాలు చేవచచ్చిన కారణంగా, సమాజం ఒక్కటిగా నిలబడి పోరాడలేనప్పుడు ఉన్మాదం రెచ్చిపోతుంది. నిలదీసే గొంతులను వెంటాడుతుంది. గోవింద్‌ పన్సారే, దభోల్కర్‌ల హత్యలపై విచారణ వేగవంతం చేయాలంటూ గౌరి హత్యకు వారం రోజుల ముందు బొంబాయి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌సీ ధర్మాధికారి విలువైన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలు చెదురు మదురుగా జరిగినవి కాదు. సంస్థాగతమైన మద్దతు లేనిదే, ఎప్పటికప్పుడు డబ్బు చేతికందనిదే హంతకులు ఇలాంటి దుండగాలకు పాల్పడటం, దీర్ఘకాలం తప్పించుకు తిరగడం సాధ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో లోగడ జరిగిన కల్బుర్గి హత్యకైనా, ఇప్పుడు గౌరి హత్యకైనా వర్తిస్తుంది. మహారాష్ట్రలో దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే హత్య కేసుల్లో ఇంతవరకూ సీబీఐ సాధించింది శూన్యం. అనుమానితులంటూ ఒకరిద్దర్ని అరెస్టు చేసినా దర్యాప్తు తీరు ఏమాత్రం సరిగా లేదని హైకోర్టు అక్షింతలు వేసింది. పాలకులు చేతగానివారైనా, ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్టు ఉండిపోయినా చివరకు జరిగేది ఇదే. ఆ పరిస్థితుల్లో సీఐడీ, సీబీఐలాంటి సంస్థలు చేయగలిగేది ఉండదు. ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా ఎనిమిదిమంది పాత్రికేయులను దుండగులు పొట్టబెట్టుకున్నారు. అనేకమందిపై దౌర్జన్యాలు సాగుతున్నాయి. అధికార పార్టీలకు తొత్తులుగా మారిన పోలీసు ఉన్నతాధికారులే బెదిరింపులకు దిగుతున్నారు. సమాజం కోసం, సమాజం తరఫున నిస్వార్ధంగా నిలదీసే గొంతుల్ని నులిమేయాలని చూసే శక్తులది ఇప్పుడు పైచేయి అవుతున్నది. దీన్ని ఎక్కడికక్కడ ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అన్యాయాలను, అక్రమాలను నిలదీయడానికి పత్రికలు నిలబడడం లేదన్న కారణంగా పాలకులు రెచ్చిపోతున్నారు. తమతో ఏకీభవించనివారిని హతమార్చడమే మార్గంగా ఎంచుకున్నారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు హెచ్చరిక చేసనట్లుగానే అర్థం చేసుకోవాలి. గోరక్షకుల దాడుల గురించి, తాజాగా గోరఖ్‌పూర్‌ శిశు మరణాలపైన తీవ్ర నిరసన వ్యక్తం చేయడం వరకూ గౌరి నిరంతరాయంగా ధ్వజమెత్తుతూనే ఉన్నారు. ఆమె తన గురించి తనే పేర్కొన్నట్టు ఎంత వేగంగా స్పందిస్తారంటే, ప్రస్తుతం కేంద్రం, సుప్రీంకోర్టు నడుమ ఉన్న రొహింగ్యా శరణార్థుల పునరావాసం గురించి కూడా సామాజిక మాధ్యమాలలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనితో పాటు నక్సలైట్‌ ఉద్యమంలోని వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి రప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కన్నడ వారపత్రిక ‘గౌరి లంకేశ్‌ పత్రికె’కు గౌరి సంపాదకురాలు. తండ్రి నుంచి ఆ పత్రికతో పాటు, ఆయన భావాలు కూడా ఆమెకు వారసత్వంగా వచ్చాయి. ఇద్దరూ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పత్రికను ఆయుధంగా చేసుకున్నారు. ఆమె హత్యపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామనీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. దబోల్కర్‌, పన్సారేల హత్యలు ఒకే తీరులో, పెద్ద ప్రణాళికతో జరిగినవేనని బొంబాయి హైకోర్టు సైతం అభిప్రాయపడింది. ఇవి అనూహ్యంగా, చెదురు మదురుగా జరిగిపోయిన ఘటనలు కావని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దబోల్కర్‌, పన్సారే, కల్బుర్గీ వంటి మేధావులూ, రచయితలూ, హేతువాదులను చంపివేయడం ద్వారా మేధావులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు గౌరిని హత్య చేయడం ద్వారా జర్నలిస్టులకు హెచ్చరిక చేశారు.