ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు

గురువారం 24`2`2022
ఉక్రెయిన్‌పై యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా దాని ప్రభావంతో భారత్‌ చిగురుటాకులా వణికే పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా రష్యా దాడికి దిగితే మన ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థినిపుణులు అంటున్నారు. దీంతో ఎక్కడా యుద్దం రావద్దని మనం కోరుకుం టున్నారు. మొన్నటికి మొన్న అఫ్ఘన్‌ పరిణామాలు కూడా మనలను తీవ్రంగా కలచివేసాయి. తాజాగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేలోపు అగాథంలో పడుతుందా అన్న భయాలు కలుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న క్రమంలో ప్రధానంగగా పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం పడనుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేయాలని ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులకు భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మంగళవారం నుండే ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. న్యూ ఢల్లీి నుండి ఉక్రేయిన్‌ రాజధిని కీవ్‌కు ఎయిర్‌ ఇండియా విమానాలు బయలుదేరి వెళ్లాయి. మరోవైపు ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి సమావేశం రెండు దేశాలను సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చర్చల కు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. తమ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, అమెరికా విదేశాం మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారని ఆ దేశం తెలిపింది. అమెరికా జోక్యంతో ప్రారంభ మైన పరిణామాలు తీవ్ర స్థాయికి చేరుకుం టున్నాయి. ఉక్రెయిన్‌లోని డాంటెస్క్‌, లుగాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో శాంతిని పరిరక్షణ కోసం అవసరమైన బలగాలను పంపాలని రక్షణశాఖను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. ఈ పరిణామం పట్ల ఉక్రెయిన్‌ మండిపడిరది. రష్యాతో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఉక్రెయిన్‌ సంక్షోభం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అవసరమైతే పుతిన్‌తో నేరుగా భేటీ అయ్యేందుకు కూడా తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించినా పుతిన్‌ అందుకు సిద్దంగా లేడని ఆయన చర్యలను బట్టి తెలుస్తోంది. అఫ్ఘాన్‌ª`లో రష్యా ఉన్నంత కాలం కొంత సజావుగా ఉన్నా.. అమెరికా రాకతో మల్లీ తాలిబన్ల పట్టు పెరిగింది. ఇది కూడా రష్యాకు అమెరికాపై కోపంగా ఉంది. అందుకు అమెరికా హెచ్చరికలను లేదా బెదిరింపులను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఖాతరు చేసే స్థితిలో లేరు. తాజా ఘటనలతో యుద్ధం మొదలు కావచ్చునని ప్రపంచం భయపడుతోంది. అక్కడి రష్యా అనుకూల తిరుగు బాటుదారులు క్రెమ్లిన్‌ సేనల చొరబాటుకు సానుకూల వాతావరణాన్ని ఇతోధికంగా సృష్టిస్తున్నారు. ఉక్రెయిన్‌ సైన్యం తన భూభాగంలోకి చొరబడిరదనీ, ఫిరంగులు పేల్చిందనీ, ఏవో ధ్వసం చేసిందనీ, ప్రతిగా తాము ఐదుగురిని చంపివేశామని రష్యా సైన్యం చెబుతుంటే, కట్టుకథలు కట్టిపెట్టమని ఉక్రెయిన్‌ అంటోంది. రష్యా తమను బూచిగా చూపి యుద్దానికి కాలుదువ్వబోతున్నదని అనుమానం. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ రంగంలోకి దిగి అమెరికా, రష్యాల మధ్య సయోధ్యకు కొంత ప్రయత్నం చేయడంతో పుతిన్‌తో నేరుగా మాట్లాడేందుకు బైడెన్‌ సిద్ధంగా ఉన్నారని వైట్‌ హౌస్‌ ప్రకటించింది. కానీ, ఎక్కువ సమయం తీసుకో కుండానే రష్యా అధ్యక్షుడు ఈ ప్రతిపాదనలని కొట్టిపారేశారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు తరలిస్తున్నందుకు నాటోవిూద విరుచుకుపడ్డారు. రష్యా డిమాండ్లు నెరవేర్చకుండా ఈ రకమైన విన్యాసాలు ఎన్ని చేసినా నిష్పయ్రోజనమన్నది పుతిన్‌ వాదిస్తున్నారు. మొత్తంగా ఏ క్షణాన్నయినా యుద్ధంలోకి
జారిపోయే ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. రష్యా డిమాండ్లను కాదుపొమ్మనడం వల్ల యుద్ధనివారణ అసాధ్యం. నాటోనుంచి రష్యా కొన్ని రక్షణ హావిూలు కోరుతోంది. ఉక్రెయిన్‌కు నాటోలో చోటివ్వకపోవడం, 1997 మే తరువాత నాటోలో చేరిన తూర్పు యూరప్‌ దేశాలనుంచి ఆయుధాలను, బలగాలను ఉపసంహ రించుకోవడం,రష్యా సరిహద్దుల్లో మిసైల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయబోమని నాటో దేశాలు హావిూ ఇవ్వడం వీటిలో ప్రధానమైనవి. 2019లో రాజ్యాంగాన్ని సవరించుకొని మరీ నాటోలో చేరికకు సిద్ధపడిన ఉక్రెయిన్‌ తాను ఏమాత్రం తగ్గినా రష్యా తనను తిరిగి మింగేస్తుందని భయపడుతోంది. ఉక్రెయిన్‌కు తూర్పున రష్యా, పశ్చిమాన పోలెండ్‌, దానిని అనుకొని జర్మనీ, ఫ్రాన్స్‌ ఉన్నాయి. తూర్పు ఉక్రెయిన్‌ సహజంగానే రష్యా పక్షం. ఇప్పుడు రష్యా అధికారికంగా గుర్తిస్తానంటున్న రెండు తిరుగుబాటు ప్రాంతాలూ ఇప్పటికే కరెన్సీ నుంచి జాతీయగీతం వరకూ అన్ని విషయాల్లోనూ రష్యాతోనే నడుస్తున్నాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న దేశాలను నాటో సభ్యులుగా చేర్చుకోవడం, ఈయూ బంధంతో పెనవేయడం ద్వారా రష్యాను అంతం చేయాలని అమెరికా ఆశపడుతోందని పుతిన్‌ ఆగ్రహంగా ఉన్నారు. ఒక్క అంగుళం కూడా విూవైపు విస్తరించ బోమని 1990లో హావిూ ఇచ్చిన నాటో అనంతరకాలంలో దుర్మార్గంగా చొచ్చుకొచ్చిందని రష్యా ఆగ్రహం. రష్యా ఇప్పుడు ఆర్థికంగా కొంత తేరుకొన్న నేపథ్యంలో పశ్చిమదేశాలను సవాలు చేయగలు గుతున్నది. ఉభయపక్షాలూ నిజంగానే యుద్దాన్ని నివారించదల్చుకుంటే, ఉక్రెయిన్‌ విషయం లోనైనా నిర్దిష్టమైన హావిూలు నాటోనుంచి రష్యాకు తక్షణం దక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. రష్యా చర్యలను, తదనంతర పరిణామాలను చర్చిస్తోంది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని మండలి కోరింది. తమ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా వదులుకునేది లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా తీసుకున్న చర్యను తీవ్రంగా నిరసిస్తున్న బ్రిటన్‌, ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలు గా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా భారీగా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. పూర్వపు సోవియట్‌ సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాలని రష్యా భావిస్తోందంటూ వచ్చిన ఆరోపణలను పుతిన్‌ తిరస్కరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి రావాల్సిన సహజవాయువు దిగుమతులు రాకపోయినా తమ దేశ ఇంధన అవసరాలు తీర్చుకోగలమని జర్మనీ తెలిపింది. ఉక్రెయిన్‌పై నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో ఆసియా స్టాక్‌ మార్కెట్లలో ఆ ప్రభావం కనిపిస్తున్నది. మొత్తంగా ప్రపంచంలో యుద్దమేఘాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉమ్మడిగా ఉంది.