ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రత దళాలు

శ్రీనగర్‌,నవంబర్‌ 28 (జనంసాక్షి): బుధవారం కుత్పోరా ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టగా.. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా బుడ్గాం జిల్లాలో అంతర్జాల, మొబైల్‌ సేవలను నిలిపివేశారు. జమ్ము కశ్మీర్‌లోని బుడ్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ ఏ తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది నవీద్‌ జఠ్‌ హతమయ్యాడు. ఇతను సీనియర్‌ జర్నలిస్టు శుజాత్‌ బుఖారీ హత్య కేసులో ప్రధాన నిందితుడు. నవీద్‌తోపాటు మరో ఉగ్రవాదిని సైతం భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది నవీద్‌ జఠ్‌ గత ఫిబ్రవరిలో పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. జూన్‌ 14న మరో ఇద్దరు ఉగ్రవాదులతో కలిసి సీనియర్‌ జర్నలిస్టు శుజాత్‌ బుఖారీని హత్య చేశాడు. బుఖారీ కశ్మీర్‌కు చెందిన ఆంగ్ల పత్రిక రైజింగ్‌ కశ్మీర్‌ సంపాదకుడు. కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా బుఖారీని ఉగ్రవాదులు చంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు సెక్యూరీటీ సిబ్బంది కూడా మరణించారు.