ఉత్తరాదిని కుమ్మేస్తున్న పొగమంచు, చలి

హర్యానాలో పొగమంచు కారణంగా ప్రమాదం
వాహనాలు ఢీకొని ఏడురుగు మృతి
ఢిల్లీని వణికిస్తున్న చలిపులి
సిక్కింలో పర్యాటకులను మంచు నుంచి కాపాడిన సైన్యం
న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఉత్తరాదిని పొగమంచు, చలి కుమ్మేస్తున్నాయి. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడమే గాకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలో పొగమంచు కారణంగా జరగిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.  సిక్కింలో మంచులో చిక్కుకున్న పర్యాటకులను సైన్యం/- సురక్షితంగా కాపాడింది. అంబాలా- చండీగఢ్‌ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. చండీగఢ్‌ వైపు నుంచి వస్తున్న రెండు వాహనాలు దట్టమైన పొగ మంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొని మరో వాహనంపైకి దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సవిూప ఆసుపత్రికి తరలిచారు. మృతులను చండీగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం ఉదయం హరియాణాలోని జజ్జర్‌ జిల్లాలో పొగ మంచు కారణంగా జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఇకపోతే దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. శనివారం ఉదయం సాధారణ ఉష్ణోగ్రతల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణంగా 19 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కావాలి. కానీ  ఉదయం 2.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో 85 శాతం తేమ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సిక్కింలోని భారత్‌-చైనా సరిహద్దుల్లో నాథులా మార్గం వద్ద  చిక్కుకున్న 3 వేల మంది టూరిస్టులను భారత సైన్యం కాపాడింది. పెద్దఎత్తున కురుస్తున్న మంచు కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనాలు మంచులో చిక్కుకుపోవడంతో సైన్యం హుటాహుటిన వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పర్యాటకులకు వసతి కల్పించడం కోసం జవాన్లు తమ బ్యారక్‌లను ఖాళీ చేసి ఇవ్వడం విశేషం. పర్యాటకుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారనీ.. అందరికీ ఆహారం, వసతితో పాటు రగ్గులు కూడా అందించినట్టు ఆర్మీ వెల్లడించింది. నాథులా మార్గాన్ని సందర్శించి తిరిగి వస్తున్న 300 నుంచి 400 వాహనాలు మంచు కారణంగా 17వ మైలు వద్ద చిక్కుకున్నాయి. భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగ సహాయక చర్యలు చేపట్టింది. అందరినీ తరలించి ఆహారం, వసతి కల్పించింది. చలినుంచి కాపాడుకోవడానికి రగ్గులతో పాటు అవసరమైన మందులు సరఫరా చేశామని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. 17వ మైలు వద్ద 1500 మంది చిక్కుకోగా… మిగతా వారంతా 13వ మైలువద్ద నిలిచిపోయారని ఆయన తెలిపారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు సైన్యం భారీ యంత్రాలు, డోజర్లు వినియోగిస్తోంది.