ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళ మృతి 

మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ,జనవరి(జ‌నంసాక్షి): దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీహార్‌కు చెందిన జేడీయూ మాజీ ఎమ్మెల్యే రాజూసింగ్‌ జరిపిన ఉత్సవ కాల్పుల్లో గాయపడ్డ మహిళఅర్చనా గుప్తా  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. అర్చనా గుప్తా చనిపోయినా కొన్ని గంటల్లోనే పోలీసులు రాజూసింగ్‌ను, ఆయన డ్రైవర్‌ హరీసింగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఓ రైఫిల్‌ను, మరో పిస్టల్‌ను ఆయన కారునుంచి స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం  పలుకుతూ ఆయన వేడుకగా జరిపిన కాల్పుల్లో అర్చనా గుప్తా (43) అనే మహిళ గాయపడ్డారు. ఆమె తలలోంచి తూటా దూసుకుపోయింది. దానిని ఎలా బయటకు తీద్దామా అని వైద్యులు తర్జనభర్జనలు చేస్తుండగానే ఆమె అంతిమశ్వాస విడిచారు. ఆమె ఇద్దరు పిల్లలు బోర్డు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న నేపథ్యంలో ఈ ఘోరం జరిగింది. వాస్తవానికి కాల్పులు జరిపే ముందు సూచిస్తే పక్కకు వెళ్తానని ఆమె చెప్పారట. కానీ రాజూసింగ్‌ ఉన్నపళంగా కాల్పులు జరపడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో కంగారు పడిన మాజీ ఎమ్మెల్యే అక్కడినుంచి తన వాహనంలో జారుకున్నారు. ఈ ఘటనకు బాధ్యుడిని నేనే అంటూ పార్టీకి హాజరైన మరో వ్యక్తి ప్రకటించినప్పటికీ పోలీసులు అతని మాటలు నమ్మలేదు. ఎమ్మెల్యే పారిపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు తలెత్తాయి. పైగా సీసీటీవీలో నూతన సంవత్సర వేడుకల ఫుటేజీని మాయం చేయడంతో అనుమానాలు బలపడ్డాయి.