ఉద్యోగ కల్పనే మా తొలి ప్రాధాన్యం

– నాలుగున్నరేళ్లలో మోదీ పాలనలో విఫలమయ్యారు
– కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
జైపూర్‌, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని, తాము అధికారంలోకి రాగానే ఉద్యోగ కల్పనకే తొలి ప్రాధాన్యత నిస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్‌ మోదీపై ధ్వజమెత్తారు. వచ్చే 15 నుంచి 20ఏళ్లలో భారత్‌లో సరైన ప్రభుత్వం ఉంటే చైనాను అధిగమిస్తుందని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం చాలా పెద్ద సవాలు అని, మోదీ ఇందులో విఫలమయ్యారని ఆరోపించారు. మనకు అతిపెద్ద పోటీదారు అయిన చైనా రోజుకు 50వేల ఉద్యోగాలు సృష్టిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరర్ధక ఆస్తులు రూ.2లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడు అవి రూ.12లక్షల కోట్లకు పెరిగాయని విమర్శించారు. భారత సైన్యం చేపట్టిన సర్జికల్‌ స్టైక్ర్‌నుకూడా మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించారు. మోదీ అన్నీ తనకే తెలుసు అని భావిస్తారని విమర్శించారు. దేశంలో మహిళా సాధికారిత పెరగాలని ఆకాంక్షించారు. ఝాన్సీ రాణి గొప్ప మహిళ అని, దేశం కోసం పోరాడిందని గొప్పగా చెప్తాం… కానీ సమాజంలో స్త్రీలు మాత్రం ఆమెలా ఉండకూడదని అంటారు.. ఇదే అసలు సమస్య అని రాహుల్‌ వెల్లడించారు. తాము ప్రజలకు అత్యంత తక్కవ ఖర్చుకు మంచి విద్య, వైద్యం అందిస్తామని హావిూ ఇచ్చారు.