ఉన్నావ్‌ ఘటనలో మరో రెండు వారాల గడువు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) :  ఉన్నవ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అత్యాచారం బాధితురాలి కారు ప్రమాదంపై విచారణకు కోర్టు గడువు పొడగించింది. సీబీఐ విచారణకు మరో రెండు వారాలు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణకు ప్రత్యేక న్యాయమూర్తికి కావాల్సిన సమయాన్ని కేటాయించాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిమ్స్‌ వైద్యులతో బాధితురాలకి పరీక్షలు నిర్వహించేలా స్పెషల్‌ జడ్జీ ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. ఇదిలావుంటే ఉన్నావో కేసులో బాధితురాలైన బాలిక నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఉన్నావో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు తన బంధువులు, న్యాయవాదితో కలిసి వెళుతుండగా జాతీయరహదారిపై వేగంగా వచ్చిన లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జులై 28వతేదీన రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రి పాలైన బాధిత బాలిక మొట్టమొదటిసారి విూడియాతో మాట్లాడారు. రాయబరేలీ జాతీయ రహదారిపై కారులో కోర్టుకు వెళుతున్న తనను  హతమార్చేందుకే బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ లారీతో ఢీకొట్టించాడు. నేను కోర్టు విచారణకు హాజరు కాకముందు ఎమ్మెల్యే అనుచరులు నన్ను హతమారు స్తామని బెదిరించారు. ఈ కేసులో సహ నిందితుడైన వ్యక్తి నన్ను కోర్టు గదిలో ఉండగా కేసును ఉపసంహరించుకోకుంటే చంపేస్తామని హెచ్చరించారని ఉన్నావో బాధితురాలు చెప్పారు. తనను ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారని పోలీసులు, ప్రభుత్వ అధికారులకు పలు లేఖలు రాసినా ఎవరూ స్పందించ లేదని బాధిత బాలిక ఆవేదనగా చెప్పారు. తాను చూస్తుండగానే ఎదురుగా వస్తున్న లారీ మా కారును ఢీకొట్టింది. ఎమ్మెల్యే సెంగార్‌ నన్ను చంపేందుకే లారీతో ఢీకొట్టించాడు. సెంగార్‌ జైలులో ఉన్నా ఎంతకైనా తెగిస్తాడని బాలిక కన్నీళ్లతో చెప్పింది. తాను ఇంకా గాయాల నుంచి తేరుకోలేదని, తీవ్ర నొప్పితో బాధపడుతూ నడవలేక పోతున్నానని బాలిక పేర్కొన్నారు.