ఎంపి గోరంట్లపై వైసిపి నాన్చివేత ధోరణి

విచారణ జరపాలంటూ డిజిపికి వాసిరెడ్డి పద్మ లేఖ
నిరసనగా మహిళా సంఘాల దిష్టిబొమ్మ దగ్ధం

అమరావతి,అగస్టు6( జనం సాక్షి): హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై చర్యలు తీసుకునే విషయంలో వైసీపీలో హైటెన్షన్‌ మొదలైంది. మూడు రోజులుగా ఆ పార్టీ అధిష్ఠానం చర్చోపచర్చలు సాగిస్తున్నా.. ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. ఆయనపై వేటు వేస్తే.. పార్టీకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందేమోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. మొండివాడు రాజుకంటే బలవంతుడు అన్నట్లుగా.. ఒకవేళ మాధవ్‌ పార్టీపై ఎదురుతిరిగితే పరిస్థితి ఏమిటని తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. మాధవ్‌ నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ఘటన జరిగి 52 గంటలు దాటినా ఇంకా జగన్‌ చర్యలు తీసుకోలేదు. ఫోరెన్సిక్‌ దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ దర్యాప్తుపై వైసీపీ నోరు మెదపడం లేదు. రాసలీలల వీడియో నిజమేనంటూ ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చితే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా.. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయించినా.. భవిష్యత్‌లో ఇతరులపైనా ఆరోపణలొస్తే ఇదే ఒరవడి కొనసాగించి.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసి వస్తుందేమోనని భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గానికి చెందినందునే తనపై వీడియో లీక్‌ చేశారంటూ మాధవ్‌ ఇప్పటికే బీసీ కార్డు ప్రయోగించారు. ఇది ప్రతిపక్షాలపై కంటే.. వైసీపీపైనే బాగా ప్రభావం చూపిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో కొందరు వైసీపీ నేతల వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వస్తాయని.. బీసీ కాబట్టే ఇప్పుడు మాధవ్‌పై వేటు వేశారని అంతా భావిస్తారని.. ఇది రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తుందని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా.. మాధవ్‌ వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.మరోవైపు మాధవ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో మాధవ్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని కోరారు. సత్వర విచారణ చేపట్టాలని ఆమె డీజీపీకి లేఖ రాశారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖ రాసినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నిరసనలు వెల్లువెత్తాయి. మాధవ్దిష్టిబొమ్మలుఎ దగ్ధంచేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పొట్టి శ్రీరాములు కూడలిలో ఎంపీ గోరంట్ల మాధవ్‌ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ కావడంతో మహిళలు గౌరవానికి భంగం కలిగించిన ఎంపీని అరెస్టు చేయాలంటూ ఆయన దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య కాసేపు తోపులాట జరిగింది. టూ టౌన్‌ సీఐ చిన్న గోవిందు టీడీపీ కార్యకర్తల చేతుల్లోని మాధవ్‌ దిష్టిబొమ్మను లాక్కోవడంతో.. పోలీసులు జులుం నశించాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపై ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ కమ్మ కులాన్ని దూషించడాన్ని నిరసిస్తూ కమ్మ సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కమ్మ భవన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో కమ్మ సంఘం నాయకులు మాట్లాడుతూ..ఎంపీ గోరంట్ల తక్షణమే కమ్మ కులానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ..అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళలను గౌరవించని ఎంపీ మాధవ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.