ఏడాదిలో కనిష్ఠానికి పెట్రోల్‌ ధర

న్యూఢిల్లీ,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అక్టోబరులో జీవనకాల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్‌ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ తాజాగా ఈ ఏడాదిలో కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దేశ రాజధాని దిల్లీలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర 7 పైసలు తగ్గి రూ. 69.79గా ఉంది.2018 జనవరి 4న ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ అత్యంత తక్కువగా రూ. 69.97 ధరకు అమ్ముడైంది. తాజాగా ఏడాదిలోనే కనిష్ఠానికి తగ్గింది. అటు డీజిల్‌ ధర కూడా 9 నెలల కనిష్ఠానికి పడిపోయింది. మంగళవారం డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. సోమవారం లీటర్‌ ధర రూ. 63.83గా ఉంది. ఈ ఏడాది మార్చి తర్వాత డీజిల్‌ ధర ఇంత తక్కువగా ఉండటం మళ్లీ ఇప్పుడే. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయిలో మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 75.41, కోల్‌కతాలో రూ. 71.89, చెన్నైలో రూ. 72.41గా ఉంది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో రూ. 66.79, కోల్‌కతాలో రూ. 65.59, చెన్నైలో రూ. 67.38గా ఉంది.