ఐటీ హడల్‌


– బెంగళూరు, చెన్నైలలో ఐటీ దాడులు
– కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు
– చెన్నైలో పలు రెస్టారెంట్‌లలో సోదాలు
బెంగళూరు, జనవరి3(జ‌నంసాక్షి) : బెంగళూరు, చెన్నైలలో ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బెంగళూర్‌లోని పలువురు కన్నడ నటీనటుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్‌ రాజ్‌కుమార్‌ నివాసం సహా.. మన్యతా టెక్‌ పార్క్‌లోని ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌కు చెందిన ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, నటుడు సుదీప్‌, కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. రాక్‌లైన్‌ వెంకటేశ్‌ సహా.. నిర్మాతలు జయన్న, కేజీఎఫ్‌ చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ నివాసాల్లో సైతం ఐటీ దాడులు జరిగాయి. రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అయిన రాక్‌లైన్‌ వెంకటేశ్‌.. కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎక్కువగా సినిమాలు తీశారు. పలు హిట్‌ చిత్రాలకు పంపిణీదారుగానూ వ్యవహరించారు. 2015లో రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించిన బజరంగీ భాయ్‌జాన్‌ చిత్రానికి గానూ జాతీయ పురస్కారం లభించింది. మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐదు
ప్రముఖ రెస్టారెంట్‌ గొలుసు సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. శరవణ భవన్‌, గ్రాండ్‌ స్వీట్స్‌, హాట్‌ బ్రీడ్స్‌, అంజాప్పర్‌ గ్రూప్‌తో పాటు మరో గొలుసు సంస్థ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని మొత్తం 32 స్థలాల్లో ఈ దాడులు చేస్తున్నారు. గొలుసు సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. ఈ ఐదు సంస్థలు పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఈ ఐదు సంస్థలు రూ. వేల కోట్లలో పన్ను ఎగవేసినట్లు మాకు సమాచారం వచ్చిందని, దీనిపై విచారణ చేసిన తర్వాతే సోదాలు నిర్వహిస్తున్నామని ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు విూడియాతో చెప్పారు. దాడులు నిర్వహిస్తున్న శరవణ భవన్‌కు న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌, సింగపూర్‌తో పాటు ఇతర దేశాల్లోను అవుట్‌లెట్స్‌ ఉన్నట్లు తెలుస్తుంది.