ఒడిషా వేదికగా ప్రపంచహాకీ పోటీలు


43 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని భారత హాకీ జట్టు
దక్షిణాఫ్రికాతో నేడు తొలిపోరు
భువనేశ్వర్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రపంచ హాకీ కప్పుకు ఒడిషా వేదికయ్యింది. అట్టహాసంగా పోటీలు రుగబోతున్నాయి. మరోమారు సత్తా చాటేందుకు భారత్‌ టీమ్‌ కసరత్తు చేస్తోంది. తొలిగా దక్షిణాఫ్రికాతో బుధవారం తలపడనుంది.  ఆత్మవిశ్వాసంతో 43 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని భారత హాకీ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచకప్‌ అందుకొని హాకీకి తిరుగులేని ప్రజాదరణ తేవాలన్న పట్టుదలతో ఉంది. బుధవారమే దక్షిణాఫ్రికాతో తొలి పోరులో తలపడనుంది. మెగా టోర్నీలో శుభారంభం చేయాలని కోరుకుంటోంది. 1975లో అజిత్‌పాల్‌ సింగ్‌ నేతృత్వంలో ఫైనల్లో పాక్‌ను ఓడించి స్వర్ణం గెలిచిన టీమిండియా ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌లో రారాజుగా నిలిచిన భారత్‌ 1982లో ఐదో స్థానంలో నిలవడమే అత్యుత్తమం. ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉన్న టీమిండియా ఈ సారి చరిత్రను తిరగరాయాలని ఆటగాళ్లూ, అభిమానులూ కోరుకుంటున్నారు. విజేతగా నిలవాలంటే రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ఆస్టేల్రియా, నెదర్లాండ్స్‌, జర్మనీ, ఒలింపిక్స్‌ విజేత అ/-జ్గం/ంటీనాను అడ్డుకోవాలి. వారికన్నా మంచి ఆటతీరు కనబరచాలి. ఇప్పటి వరకు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన జట్లు 8 లేదా అంతకన్నా కాస్త పై స్థానంలో మాత్రమే నిలిచాయి. ఈ ఒరవడిని కోచ్‌ హరేంద్ర సింగ్‌ నేతృత్వంలోని కుర్రాళ్లు బద్ధలు చేయాలి. ఆసియా కప్‌ను చేజార్చుకోవడంతో ప్రస్తుత టోర్నీకి ఆయనకు చావోరేవో లాంటిదే. అయితే రెండేళ్ల క్రితం ఆయన శిక్షణలోనే జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ను గెలవడం విశ్వాసం కలిగించేదే. ప్రపంచకప్‌ గెలిచేందుకు జూనియర్‌ జట్టులోని 18 మందిలో ఏడుగురిని సీనియర్‌ జట్టుకు ఎంపిక చేశారు. సారథి మన్‌ప్రీత్‌సింగ్‌, సీనియర్లు పీఆర్‌ శ్రీజేశ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, బీరేంద్ర లక్రా విజృంభించి ఆడాల్సి ఉంది. ప్రస్తుతం జట్టు యువ, సీనియర్‌ ఆటగాళ్లతో సమతూకంగా ఉంది. డ్రాగ్‌ప్లికర్‌ రూపిందర్‌పాల్‌ సింగ్‌ను తీసుకోలేదు. ఫిట్‌నెస్‌ లేమితో ఎస్వీ సునిల్‌ను ఎంపిక చేయలేదు. భారత్‌తో పాటు ‘పూల్‌-సి’లో దక్షిణాఫ్రికా, బెల్జియం, కెనడా ఉన్నాయి. ప్రపంచ మూడో ర్యాంకు జట్టు బెల్జియంను ఓడించాలంటే ఐదో స్థానంలో టీమిండియా కష్టపడక తప్పదు. దక్షిణాఫ్రికా (15), కెనడా (11)తో ఇబ్బంది లేదు. అలాగని తేలిగ్గా తీసుకోరాదు. బుధవారం భారత్‌, సఫారీలతో తలపడనుంది. ఈ రెండు జట్లు ప్రపంచపక్‌లో ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడగా మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఒక మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. భారత్‌ 7, దక్షిణాఫ్రికా 6 గోల్స్‌ చేసింది. మొత్తం నాలుగు ఫూల్స్‌, ఒక్కో దాంట్లో నాలుగు జట్లు ఉన్నాయి. తొలిస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్‌ ్గ/నైల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లోని జట్లు క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌లు ఆడతాయి. మొత్తం 8 జట్లు క్వార్టర్స్‌ ఆడతాయి. క్రాస్‌ఓవర్‌, క్వార్టర్స్‌ మ్యాచుల్లో ఆస్టేల్రియా, నెదర్లాండ్స్‌, జర్మనీ, అర్జెంటీనా ఫెవరెట్‌గా ఉన్నాయి.