కన్నయ్య లాంటి కొడుకు కావాలి

సిజేరియన్‌ ద్వారా జన్మాష్టమి రోజు డెలివరీలకు సిద్దం
ఆస్పత్రిలో పలువురు మహిళల దరఖాస్తు
న్యూఢిల్లీ,ఆగస్ట్‌24 (జనంసాక్షి): సిజేరియన్‌ ద్వారా డెలివరీ కోరుకుంటున్న మహిళలు ఇప్పుడు ముహూర్తాలు చూసుకోవడం పరిపాటిగా మారింది. గతంలో సమయాన్ని డాక్టర్లు నిర్ణయిస్తే ఇప్పుడు వీరు నిర్ణయించుకుంటున్నారు. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పలువురు మహిళలు తమకు సిజేరియన్‌ చేయాలని ఆస్పత్రిలో చేరారు.  కొడుకు పుడితే బాలకృష్ణునిలా అందంగా ఉండాలని, తన చిలిపి చేష్టలతో ఇల్లంతా సందడి చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అదికూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పుడితే ఇక వారి ఆనందానికి హద్దులు ఉండవు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ తల్లులు కావాలనుకుంటున్న పలువురు గర్భిణులు సిజేరియన్‌ ద్వారా కన్నయ్యను కనాలని పరితపించారు. ఇందుకోసం ముందుగానే తగిన ప్లాన్‌ కూడా చేసుకున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా వైద్యులు మాట్లాడుతూ తన వద్ద చికిత్స తీసుకుంటున్న గర్భిణులు శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు సిజేరియన్‌ విధానంలో డెలివరీ చేయించుకోవాలనుకుంటున్నారని తెలిపారు. కాగా నోయిడాకు చెందిన అనురాగ్‌ మాట్లాడుతూ తాను బ్యాంకు ఉద్యోగినని, తన భార్య అర్చనకు డెలివరీ సమయం దగ్గరపడిందని, ఆమె ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నదని తెలిపారు. తన భార్య బాలకృష్ణుని లాంటి బాలుడు కావాలని కోరుకుంటోందని, అందుకే ఈరోజు డెలివరీ కోసం డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నామని తెలిపారు. కాగా ఇదేవిధంగా గజియాబాద్‌లోని కొలంబియా ఏషియా ఆసుపత్రిలో ఐదుగురు గర్భిణులు ఈరోజు సిజేరియన్‌ ద్వారా డెలివరీ చేయించుకుంటున్నారు. ఆసుపత్రికి చెందిన సీనియర్‌ గైనకాలజిస్టు డాక్టర్‌ రంజనా బెకాన్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో పలువులు గర్భిణులు చికిత్స తీసుకుంటున్నారని, వారిలో కొంతమంది శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు సిజేరియన్‌ పద్ధతి ద్వారా డెలివరీ చేయించుకోవాలనుకుంటున్నారని తెలిపారు.