కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీ అరెస్టు

– అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు
న్యూఢిల్లీ, ఆగస్టు20(జనం సాక్షి) : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రతుల్‌ పూరీ, మరో నలుగురు కలిసి ‘మోసెర్‌ బేర్‌’ అనే సంస్థ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రూ.354 కోట్ల రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేసినట్లు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీబీఐకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రతుల్‌ పూరీ, డైరెక్టర్లు నీతా పూరీ, సంజయ్‌ జైన్‌, వినీత్‌ శర్మపై అభియోగాలు దాఖలు చేశారు.
బ్యాంకులను మోసం చేసిన కేసుతో పాటు రతుల్‌ పూరీ వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యూపీయే ప్రభుత్వ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో కూడా లంచాలు తీసుకున్నట్లు రతుల్‌పై అభియోగం దాఖలైంది. అయితే వీటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. అగస్టా కేసులో రతుల్‌కు సోమవారం సమన్లు అందజేసిన సీబీఐ, ఒకరోజు
తిరగకుండానే మంగళవారం బ్యాంకులను మోసగించిన కేసులో ఆయన్ను ఆరెస్టు చేసింది.