కర్నాకటంలో అందరూ పాత్రధారులే

రాజకీయ పరిణతి చూపించలేకపోయిన కుమార
చాపకింద నీరులా పావులు కదిపిన సిద్దూ
బెంగళూరు,జూలై 24(జ‌నంసాక్షి): కర్నాటకానికి ఇంకా తెరపడలేదు. కేవలం కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌, కాంగ్రెస్‌ కూటమి మాత్రమే అధికారం నుంచి వైదొలగింది. తదుపరి ప్రభుత్వం యెడ్యూరప్ప ఏర్పాటు చేస్తారా అందుకు తగ్గ బలం ఉందా అన్నది ముఖ్యం. కర్నాటక వ్యవహారంలో
చాపకింద నీరులా కాంగ్రెస్‌ పార్టీ సొంతనేతలే అక్కడి కుమార స్వామి ప్రభుత్వాన్ని కూలదోయడానికి బాగా పనిచేశారు. వ్యూహాత్మకంగా విజయం సాధించారు. తమకు లేని అధికారం కుమారస్వామికి ఎందుకన్న రీతిలో మాజీ సిఎం సిద్దరామయ్య బాగానే స్కెచ్‌ వేసి సక్సెస్‌ అయ్యారు. ఇక్కడ అసలుసిసలు విజేత సిద్దరమాయ్య అనడంలో సందేహం అసవరం లేదు.  అలాగే రాజకీయ పరిణతి చూపి సమస్యను పరిస్కరించుకే చతురతను కుమారస్వామి చూపలేక చతికిల పడ్డారు. బీజేపీకి అధికారం దక్కరాదనే ఏకైక లక్ష్యంతో గతేడాది మే 13న కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఒక్కటయ్యాయి. ఆ ప్రయత్నంలో తొలుత విజయం సాధించినా సంకీర్ణ ప్రభుత్వం కుదురుకోకపోవడానికి కారణం నిత్యం కీచులాటలే! ఈ పొత్తు అసలే ఇష్టం లేని మొదటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అని చెప్పకతప్పదు.  ఒకప్పుడు దేవెగౌడకు నమ్మినబంటైన ఆయన కాలక్రమేణా ఆయనకు ఆగర్భ శత్రువై- కాంగ్రెస్‌లో చేరి సీఎం గ్దదెనెక్కి ఐదేళ్లూ పాలన సాగించారు. అలాంటి సిద్ధూ తన ప్రబల శత్రువుకు అధికారం పంచివ్వడానికి ససేమిరా అన్నా ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు ఆయనను ఒప్పించారు. వారి కోసం ఒప్పుకున్నప్పటికీ- ఎప్పటికప్పుడు కుమారకు వ్యతిరేకంగా అసమ్మతిని రేపుతూనే వచ్చారు. మొదట మంత్రిత్వ శాఖల విషయంలో రగడ మొదలు పెట్టారు. ఇదంతా ఎందుకు రాజీనామా చేసిన వారంతా సిద్దూ నమ్మిన బంటులే కావడం గమనించాలి. అందుకే కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను కాపాడలేదని కుమారస్వామి అసెంబ్లీ వేదికగా గట్టిగానే అన్నారు. అంతెందుకు నిత్యం గొడవల కారణంగా ప్రతీ రెండు రోజులకోసారి రాహుల్‌గాంధీకి కుమారస్వామి ఫోన్‌ చేయడం, ఆయన కేసీ వేణుగోపాల్‌ చేత మాట్లాడించడం… ఇలా కుమార ప్రభుత్వం దినదినగండంగా సాగింది. కుమార ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదు, మరో రెండునెలలంతే.. అని తనకు విధేయులైన కొందరు ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య వ్యాఖ్యానించిన వీడియో కూడా వైరల్‌ అయింది. నాకు క్షణం మనశ్శాంతి లేదు.. అని స్వయానా కుమారస్వామి వాపోవడం, పలుమార్లు కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగాయి. శివుడు గరళాన్ని మింగినట్లు అన్నీ భరిస్తున్నానని చెప్పడం కూడా సమస్యపరాకాష్టకు చేరిందని గుర్తించాలి. కనీసం మూడు సందర్భాల్లో ఆయన రాజీనామా హెచ్చరిక చేశారు. చివరకు లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య చిచ్చు రేగింది. మండ్య సీటు జేడీఎస్‌కు వదలడం ఇష్టంలేని కాంగ్రెస్‌ అక్కడ దేవెగౌడ మనవడికి వ్యతిరేకంగా, సుమలతకు అనుకూలంగా ప్రచారం జరిపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీ సాధించగా, కాంగ్రెస్‌ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు ఈ ఎన్నికలే కుమార భవితను తేల్చేశాయి. ఎన్నికల అనంతరం తిరుగుబాట్లను తట్టుకోలేక ఆయన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. అదే సమయంలో బీజేపీ… రెబెల్స్‌ను ఉసిగొలిపి ఆయన కుర్చీని లాగేసుకుంది. మొత్తంగా పదిహేనురోజులుగా సాగుతున్న కర్నాటకానికి తెరపడింది. ఇప్పుడు బిజెపి తన ఖాతాలో కర్నాటకను వేసుకోబోతోంది.