కశ్మీర్‌పై పాక్‌ కుతంత్రాలు కట్టిపెట్టాలి

ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు మానాలి
గిల్గిట్‌ బలూచిస్థాన్‌లో మానవహక్కులను కాపాడాలి
పాక్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌
కశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారం అన్న రాహుల్‌
న్యూఢిల్లీ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కశ్మీర్‌పై తమ వాదాన్ని నెగ్గించుకోవడానికి పాకిస్థాన్‌ చేస్తున్న కుయుక్తులను కాంగ్రెస్‌ పార్టీ ఎండగట్టింది. ఐరాసలో పాక్‌ వేసిన పిటిషన్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని లాగడం పట్ల తీవ్రంగా విరుచుకుపడింది. తమ అబద్దాల్ని, పిచ్చి ప్రేలాపనలను కప్పిపుచ్చుకోవడానికే పాక్‌ ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతోందని దుయ్యబట్టింది. జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. అతేగాకుండా కాశ్మీర్‌ భారత్‌ అంతర్గత వ్యవహారమని అన్నారు. దీనిపై ప్రపంచంలో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పష్టం చేశారు. కశ్మీర్‌ లోయలో పాక్‌ హింసను ప్రోత్సహిస్తోందని తేల్చి చెప్పారు.
కశ్మీర్‌పై పిచ్చి ప్రేలాపనలు మాని, గిల్గిట్‌ బలూచిస్థాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచానికి పాక్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రణ్‌దీప్‌ అన్నారు. మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాలపై కూడా పాక్‌ సమాధానం చెప్పాలన్నారు. 2018లో 128మంది అమాయకుల హత్యాకాండను ప్రపంచం మొత్తం వీక్షించిందని గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాక్‌లో తేలుతున్నాయన్నారు. అధికరణ 370 రద్దుపై ఇంతకాలం కేంద్రంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ఒక్కసారిగా పాకిస్థాన్‌కు తమ వైఖరిని తేల్చి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింసకు పాకిస్థానే కారణమని అన్నారు. ఆయన ఇవాళ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కశ్మీర్‌లో ఉన్న అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విబేధిస్తానని, కానీ ఈ సమయంలో ఒక అంశాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్లు రాహుల్‌ చెప్పారు. కశ్మీర్‌ సమస్య భారత్‌ అంతర్గతమని, పాకిస్థాన్‌ లేదా ఇతర దేశాలకు ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. జమ్మూకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని, పాకిస్థాన్‌ మద్దతు ఇవ్వడం వల్ల, రెచ్చగొట్టడం వల్ల అక్కడ ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్‌ అన్నారు. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పాకిస్థానే అన్న అభిప్రాయాన్ని రాహుల్‌ తన ట్వీట్‌లో వినిపించారు.