కాంగ్రెస్‌కు వ్యవస్థలపై నమ్మకం లేదు

 

సుప్రీం తీర్పును కూడా తప్పుపడుతున్నారు
తమిళనాడు కార్యకర్తలతో మోడీ వీడియో చాటింగ్‌
న్యూఢిల్లీ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సైన్యం, కంప్టోల్రర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వంటి ప్రజాస్వామిక వ్యవస్థలన్నిటినీ కాంగ్రెస్‌ అవమానించిందని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రశ్నిస్తోందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్‌ తీరును మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఈ తీర్పు నచ్చకపోవడంతో సుప్రీంకోర్టు తీర్పునే కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోందన్నారు. తమిళనాడు లోని  వెల్లూరు, కాంచీపురం, విల్లుపురం, దక్షిణ చెన్నై జిల్లాల బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదివారం చెన్నైలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు, భారతీయ రిజర్వు బ్యాంకు వంటి వ్యవస్థలను నాశనం చేసే అవకాశం మోదీ ప్రభుత్వానికి ఇవ్వబోనని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ తీరును దుయ్యబట్టారు.
నేటినుంచి ఎంపిలతో భేటీలు
ఇదిలావుంటే ఈనెల 20 నుంచి జనవరి 3 వరకు పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా వరుస భేటీలు కానున్నారు. ఎంపీలను మొత్తం 12 గ్రూపులుగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ విభజించింది. ఈనెల 20న ఢిల్లీ, చంఢీగఢ్‌, హరియాణా, హిమాచల్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌ ఎంపీలతో భేటీ కానున్నారు. ఈనెల 27న బిహార్‌, 28న ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీప్‌ ఎంపీలతో మోదీ, అమిత్‌షా భేటీలు అవుతారు. యూపీ ఎంపీలను మూడు గ్రూపులుగా విభజించారు. వారితో ఈనెల 26,27న భేటీ అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలతో ఈనెల 28న, జనవరి 2న మహారాష్ట్ర ఎంపీలతో మోదీ, అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ భేటీలకు మంత్రులను బాధ్యులుగా బీజేపీనియమించింది.
బిజెపికి భారీ ఊరట
ఐదు రాష్ట్రాలల అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల ఘోర పరాభవం చవిచూసిన బీజేపీకి తాజాగా భారీ ఊరట లభించింది. హర్యానా మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ బుధవారంనాడు 5 మున్సిపల్‌ స్థానాలనూ కైవశం చేసుకుని క్లీన్‌స్వీప్‌ సాధించింది. ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లు, రెండు మున్సిపల్‌ కమిటీలకు ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం చేపట్టారు. రోహ్‌తక్‌, కర్నల్‌, హిసార్‌, పానిపట్‌, యమునానగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు గత ఆదివారంనాడు ఎన్నికలు జరిగారు. బీజేపీకి చెందిన అవ్‌నీత్‌ 74,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాగా, ఎన్నికలు జరిగిన ఐదు మున్సిపల్‌ కార్పొరేషన్లనూ బీజేపీ కైవశం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యకర్తల కఠోర శ్రమకు ప్రజలిచ్చిన అసాధారణ తీర్పు ఇదని ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ వ్యాఖ్యానించారు. పానిపట్‌ నుంచి తమ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.