కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌

రాజస్థాన్‌ ఎన్నికల ముందు జోష్‌
జైపూర్‌,నవంబర్‌29(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ రాజస్థాన్‌లో బిజెపికి మరో గట్టి దెబ్బతగిలింది. బిజెపికి చెందిన సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతోంది. సుదీర్ఘకాలం భాజపాలో పనిచేసిన మాజీ స్పీకర్‌ సుమిత్రా సింగ్‌ కాంగ్రెస్‌లో చేరారు. రాజస్థాన్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌, మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గె¬్లత్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండే సమక్షంలో సుమిత్రా సింగ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సుమిత్రా సింగ్‌ రాజస్థాన్‌ అసెంబ్లీకి 9 సార్లు ఎన్నికయ్యారు. 2003లో భాజపా విజయం సాధించిన తర్వాత 12వ శాసనసభకు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అదే ఏడాది వసుంధరా రాజే తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టారు. కాగా.. రాజస్థాన్‌ అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా ఈమే కావడం విశేషం. అయితే 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సుమిత్రాసింగ్‌కు టికెట్‌ ఇచ్చేందుకు భాజపా నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన ఆమె తిరుగుబాటుచేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది భాజపా, తాజాగా ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సుమిత్ర మాట్లాడుతూ.. భాజపాను ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ నాయకురాలైన అయిన సుమిత్ర కాంగ్రెస్‌లో చేరడంతో రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి అదనపు బలం చేకూరినట్లయింది. రాజస్థాన్‌లో డిసెంబరు 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఫలితాలు వెలువడుతాయి. ఆమె చేరిక తమకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చేదిగా గెహ్లాట్‌ ప్రకటించింది.