కాలుష్యం మాకు…ఉద్యోగాలు ఆంధ్రోళ్లకా..?
-ప్రైవేటు సంస్థలలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి
-మా భూముల్లో సీమాంధ్రుల పెత్తనమా సహించం
-విద్యార్థి గర్జనలో కోదండరాం
మహబూబ్‌నగర్, నవంబర్28(జనంసాక్షి): తెలంగాణ వనరులను దోచుకుంటున్న కంపెనీలు సీమాంధ్రులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నాయని కోదండరాం మండిపడ్డారు. కాలుష్యం మాకు..ఉద్యోగాలు మీకా అంటూ ఫైరయ్యారు. జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో విద్యార్థి సింహగర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజేఏసీ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిదిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ వనరులను, నీళ్లను దోచుకుంటున్న సీమాంధ్ర బడా వ్యాపారవేత్తలు తమ ప్రాంతాలకు చెందిన వారికి ఉద్యోగాలను కట్టబెడుతున్నారంటూ విమర్శించారు. ఇక్కడి వనరులను వాడుకుంటున్నందున, ఉద్యోగాలలో కూడా 80 శాతం స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి కంపెనీలకు నీళ్లు, వనరులను అడ్డుకుంటామన్నారు. ఇక్కడి యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే సీమాంధ్ర కంపెనీలు మా భూములు దోచి స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో మొండి చేయి చూపిస్తున్నాయని మండిపడ్డారు. మన భూముల్లో ఆంధ్రోళ్ల పెత్తనాన్ని సహించమన్నారు. అందుకే మన తెలంగాణ మనం సాధించుకోవాలన్నారు. మన రాష్ట్రంలోనే మన బతుకులు బాగుపడతాయన్నారు. అందుకే విద్యార్థులు ఉద్యమ సైనికుల్లా పోరాడాలన్నారు. తెలంగాణ వచ్చే వరకు విశ్రమించొద్దన్నారు. తెలంగాణ వచ్చాకే మన ఉద్యోగాలు, నీళ్లు, నిధులు మనకు వస్తాయన్నారు. అంతవరకూ సీమాంధ్ర ప్రభుత్వ వివక్షలను విద్యార్థులు, ప్రజలు ఎండగట్టాలన్నారు. తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడాలన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. తెలంగాణ ఎపుడో వచ్చిందని, అయితే సీమాంధ్ర కుట్రలతో వచ్చిన తెలంగాణను అడ్డుకొన్నారన్నారు. కావున పోరాడి మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలన్నారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదమే మనకు ఆదర్శంగా నిలవాలన్నారు. అందుకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రాంతంలో వనరుల విధ్వంసం జరుగుతుందని దానిని మనం అడ్డుకోవాలన్నారు. బొందలగడ్డ తెలంగాణ కాదని సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. దాని కోసమే విద్యార్థులు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు, జిల్లా టీజేఏసీ నాయకులు, తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.