కాల్చేయండని తాను ఎవరికీ.. ఆదేశాలు ఇవ్వలేదు

– కేవలం అవి ఉద్వేగంతో మాట్లాడిన మాటలే
– వివరణ ఇచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి
బెంగళూరు, డిసెంబర్‌25(ఆర్‌ఎన్‌ఎ) : కాల్చేయండని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. జేడీఎస్‌కు చెందిన స్థానిక నేత ఒకరు ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణమైన వారిని కనికరం లేకుండా కాల్చి పారేయండి అంటూ కుమారస్వామి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మండ్య ప్రాంతానికి చెందిన జేడీఎస్‌ నేత హెచ్‌ ప్రకాశ్‌ను సోమవారం కొందరు వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ప్రకాశ్‌ కారును అడ్డగించి కత్తులతో నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. ‘అతడు చాలా మంచి వ్యక్తి అని, ప్రకాశ్‌ను ఎందుకు చంపారో తెలియట్లేదని, హంతకులను కనికరం లేకుండా కాల్చిపారేయండి, ఎలాంటి సమస్యా ఉండదు అని కుమారస్వామి ఫోన్లో అవతలివ్యక్తికి ఆదేశాలిచ్చారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు కొందరు కుమారస్వామి మాటలను వీడియోలో రికార్డు చేశారు.
స్థానిక విూడియాలో ఈ వీడియో ప్రసారం కావడంతో అది కాస్తా వివాదాస్పదంగా మారింది. ఓ సీఎం అయి ఉండి హింసను ప్రేరేపిస్తున్నారంటూ కుమారస్వామిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆవేశంలో మాట్లాడాను – కుమారస్వామి
తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కుమారస్వామి స్పందించారు. హత్య చేయమని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని, కేవలం అవి ఆవేశంలో అన్న మాటలని వివరణ ఇచ్చారు. అది నా ఆదేశం కాదని, ఆ క్షణంలో నేను ఉద్వేగానికి లోనయ్యానని అన్నారు. ఘటనకు కారణమైన వారు ఇప్పటికే రెండు హత్యలు చేసి జైలుకెళ్లారని, రెండురోజుల క్రితమే బెయిల్‌పై వచ్చారన్నారు. మళ్లీ మరో వ్యక్తిని చంపేశారని, బెయిల్‌ను వారు ఇలా దుర్వినియోగం చేశారని, అందుకే ఆవేశంలో అలా మాట్లాడా అని కుమారస్వామి అన్నారు.