కాశ్మీర్‌లో తిరిగి ప్రారంభమైన రైలు సర్వీసులు

భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం నిర్ణయం
శ్రీనగర్‌,నవంబర్‌26(జనం సాక్షి): కశ్మీర్‌ లోయలో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బారాముల్లా-బనీహాల్‌ ప్రాంతాల మధ్య మొత్తం 138 కిలోవిూటర్ల ప్రయాణమార్గం అందుబాటులోకి వచ్చింది. రైల్వే పోలీసుల భద్రతా పర్యవేక్షణల అనంతరం అధికారులు రైలు సర్వీసులను పునఃప్రారంభించారు. కశ్మీర్‌ లోయలో శీతాకాలం సమయంలో దట్టమైన మంచు కురవడం కారణంగా రహదారి ప్రయాణాలకు తరచుగా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. రైలు సర్వీసు అందుబాటులోకి రావడంతో స్థానికంగా ఉన్న వేలమందికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ నెల 7వ తేదీన కురిసిన దట్టమైన మంచుతో రైలు పట్టాలపై 20 నుంచి 45 సెంటీవిూటర్ల మేర మంచు పేరుకుపోయింది. సహాయక సిబ్బంది పట్టాలపై మంచును క్లియర్‌ చేశారు. శ్రీనగర్‌-బారాముల్లా, శ్రీనగర్‌-బనిహాల్‌ మార్గాల్లో రైలు సర్వీసులను ప్రారంభించారు. ఈ మార్గాల్లో ఇప్పటికే ట్రయల్‌ రన్స్‌ సైతం పూర్తయ్యాయి. మొత్తం 16 రైలు సర్వీసులు ఈ మార్గాల్లో నడుస్తున్నాయి.