కాశ్మీర్‌  ఎన్నికలు ఎప్పుడు జరిపినా అభ్యంతరం లేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి): ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. జమ్ముకశ్మీర్‌ ఎన్నికలను కూడా అప్పుడే నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తే అందుకు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందన్నారు. ఈ మేరకు రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా రాజ్‌నాథ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం అనుకుంటే తగిన భద్రత కల్పించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. కాగా.. ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభ ఆమోదించింది.