కేరళలో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

– వరద ఉధృతిపై కేరళ సీఎం, గవర్నర్‌, అధికారులతో సవిూక్ష
– తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించిన మోదీ
– మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన
– సహాయక చర్యలు ఉధృతం చేయాలని ఆదేశం
తిరువనంతపూరు, ఆగస్టు18(జ‌నం సాక్షి) : గత పది రోజులుగా భారీ వర్షాల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న కేరళలో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్న దక్షిణాది రాష్ట్రంలో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకున్న ప్రధాని.. కేరళ సీఎం, అధికారులతో అత్యున్నత స్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతోపాటు కేరళ సీఎం పినరయి విజయన్‌, గవర్నర్‌ సదాశివం, పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ ఏరియల్‌ సర్వేలో ప్రధానితోపాటు పాల్గొన్నారు.
కేరళ పరిస్థితి చూసి చలించిపోయిన ప్రధాని తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని ప్రధాన మోదీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇప్పటికే ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కేరళలో ఎరియల్‌ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన రూ.100 కోట్ల మేర తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద బీభత్సంతో రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కేరళ సర్కారు ప్రధాని మోదీని కోరింది. దీంతో అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకోవడం కోసం ప్రధాని కేరళ వెళ్లారు. కేరళను ఆదుకోవడానికి తోటి రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ సర్కారు రూ.25 కోట్ల విరాళం ప్రకటించగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రూ.10 కోట్లు సాయంగా ప్రకటించింది. నీటిని శుద్ది చేసేందుకు రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మెషీన్లను కేసీఆర్‌ సర్కారు కేరళకు పంపుతోంది.
తెలంగాణ నుంచి 20టన్నుల పాలపొడి తరలింపు …
కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, అధికారులను శనివారం ఆదేశించారు. విజయ్‌ డెయిరీ నుంచి రూ.40లక్షల విలువైన 20 టన్నుల పాలపొడి పంపేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు శనివారం 20 టన్నుల పాలపొడి కేరళకు పంపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. తెలంగాణ తరఫున కేరళకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌ ఆధ్వర్యంలో ఆహారపదార్థాలను శనివారం కేరళకు పంపారు . చిన్నారుల కోసం 100 మెట్రిక్‌ టన్నుల పౌష్టికాహారాన్ని పంపారు. దాదాపు రూ 52.50 లక్షల విలువైన ఈ ఆహారపదర్థాలను బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి రక్షణశాఖకు చెందిన విమానం ద్వారా శనివారం ఉదయం 7.30 గంటలకు తరలించారు.
కేరళకు ఎస్‌బీఐ రూ. 2కోట్ల ఆర్థికసాయం…
భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న కేరళవాసులకు పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కూడా కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. సీఎం సహాయనిధికి రూ. 2కోట్ల విరాళం ప్రకటించింది. అంతేగాక.. బ్యాంకు సిబ్బంది కూడా కేరళకు ఆర్థికసాయం అందించాలని ప్రోత్సహిస్తోంది. ఆర్థిక సాయంతో పాటు కేరళ వ్యాప్తంగా తమ బ్యాంకు సేవలపై ఛార్జీలను కూడా ఎస్‌బీఐ రద్దు చేసింది. రుణాలు, డూప్లికేట్‌ పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లు, ఈఎంఐ
చెల్లింపులపై ఛార్జీలు, జరిమానాలను రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళ వాసులు తమ నిత్యావసరాల కోసం పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద రూ. 2000వరకు తీసుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది.
కేరళ కోసం యూఏఈ ఎమర్జిన్సీ కమిటీ …
యూఏఈ అభివృద్ధిలో కేరళ ప్రజల భాగస్వామ్యం ఉందని, ఆ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన ప్రత్యేక బాధ్యత తమపై ఉందని యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయద్‌ అలీ నహ్యాన్‌ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో ఓ ఎమర్జిన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీకి ఛైర్మన్‌ గా ఎమిరేట్స్‌ రెడ్‌ క్రాస్‌ క్రెసెంట్‌ (ఈఆర్సీ) ఉంటుందని, ఇందులో పలు ఎన్జీవోలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ ఆపద సమయంలో  కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఎమిరేట్స్‌ ప్రజలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కేరళలో ఈ శతాబ్దంలోనే ఎన్నడూ లేని వర్షాలు కురుస్తున్నాయి. బక్రీద్‌ జరుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఘోరవిపత్తు వచ్చిందని, ఇలాంటి సమయంలో బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.