కేరళ వరద బాధితులకు..  రాజ్యసభ ఎంపీల విరాళం


– రూ.38కోట్లు చైర్మన్‌కు అందజేత
న్యూఢిల్లీ, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : ఇటీవల కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భీకర వర్షాల వల్ల ఆ రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి కొందరు ఎంపీలు కేరళ వరద బాధితులకు విరాళం ఇచ్చారు. బుధవారం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆ విషయాన్ని ప్రకటించారు. రాజ్యసభకు చెందిన ఎంపీలు సుమారు రూ.38 కోట్లను కేరళ వరద బాధితులకు విరాళంగా ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం సభ ప్రారంభమైన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. మొత్తం 93 మంది సభ్యులు ఈ మొత్తాన్ని సేకరించినట్లు చెప్పారు. రాజ్యసభకు చెందిన 60మంది ఎంపీలు తమ నెల జీతాన్ని కేరళకు విరాళంగా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. విరాళం ఇచ్చిన వారికి వెంకయ్య కృతజ్ఞతలు చెప్పారు. మిగితా వారు కూడా ఇలాగే విరాళం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈనెల 24, 26వ తేదీల్లోనూ సభకు సెలవు ప్రకటించారు.
ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా..
ఇదిలా ఉంటే రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సభ ప్రారంభంకాగానే రాఫెల్‌ అంశంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయగా, టీడీపీ సభ్యులు ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు బీజేపీ సభ్యులు కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై మండిపడ్డారు. సుప్రింకోర్టు రాఫెల్‌పై స్పష్టమైన తీర్పు ఇచ్చినా కాంగ్రెస్‌ వితండవాదానికి దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో చైర్మన్‌ వెంకయ్య నాయకుడు కలుగజేసుకొని సమయం తక్కువగా ఉన్న కారణంగా దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని  సభ్యులకు సూచించారు. అనంతరం మంగళవారం తన ప్రసంగంలో రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తావించలేదని కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ బుధవారం స్పష్టం చేశారు. సభలో కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభను గురువారంకు వాయిదా వేశారు.