కొత్త నోట్ల పని అయిపోయినట్లేనా….!

కొత్తనోట్ల పేపర్‌ నాణ్యత డొల్ల

ప్రముఖ హిందీ వార్తా పత్రిక కథనం.

దిల్లీ, నవంబర్‌ 28 (జనంసాక్షి) : పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో రూ. 2వేలు, రూ. 500, రూ. 200 నోట్లను తీసుకొచ్చింది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. వీటితో పాటు రూ. 100, రూ. 50. రూ. 10 కొత్త నోట్లను కూడా విడుదల చేసింది. పాత కరెన్సీ నోట్లతో పోలిస్తే అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ నోట్లను తయారుచేసింది. అయితే ఈ కొత్త నోట్లు చలామణీలోకి వచ్చిన రెండేళ్లకే పనికిరాకుండా పోతున్నాయని తాజాగా ఓ హిందీ వార్తా పత్రిక తమ కథనంలో పేర్కొంది. అంతకుముందున్న నోట్లతో పోలిస్తే కొత్త నోట్ల ముద్రణలో ఉపయోగించిన పేపర్‌ నాణ్యత తక్కువగా ఉండటం వల్లే నోట్లు పనికిరాకుండా మారుతున్నాయని తెలిపింది. /ఔ. 2000, రూ. 500లతో పాటు 2018లో విడుదల చేసిన రూ. 10 కొత్త నోట్లు కూడా పనికిరాకుండా మారుతుండటంతో సమస్య తీవ్రంగా ఉందని తమ కథనంలో పేర్కొంది. దీంతో బ్యాంకులు ఈ నోట్లను ‘నాన్‌-ఇష్యూయబుల్‌(జారీ చేయకూడనివి)’ కేటగిరిలో చేర్చేందుకు పక్రియ ప్రారంభించినట్లు తెలిపింది.సాధారణంగా మన దేశంలో చాలా మంది కరెన్సీ నోట్లను చీర కొంగులకు, ధోతీ అంచులకు ముడి వేస్తుంటారు. దీంతో ఆ నోట్లు నలిగి నిరుపయోగంగా మారుతున్నాయి’ అని ఆర్థికశాఖ బ్యాంకింగ్‌ విభాగంలోని ఓ సీనియర్‌ అధికారి చెప్పినట్లు కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. నోట్ల ముద్రణలో ఉపయోగించిన పేపర్‌ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడలేదని ప్రభుత్వం చెబుతోంది. నకిలీ కరెన్సీని నివారించేందుకే అత్యంత భద్రతా ప్రమాణాలతో కొత్త నోట్లను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా నిరుపయోగంగా మారే నోట్లను బ్యాంకులు ఏటీఎంలలో పెట్టలేవు. ఎందుకంటే నాణ్యత తక్కువ ఉండే నోట్లను ఏటీఎం సెన్సార్లు గుర్తించలేవు. అందుకే వీటిని ‘నాన్‌-ఇష్యూయబుల్‌’ కేటగిరిలో చేరుస్తుంటారు. చిరిగిన, మురికిపట్టిన, పాతబడిపోయిన నోట్లను ఈ జాబితాలో చేర్చి.. వాటిని ఆర్‌బీఐకి పంపుతారు. అయితే బ్యాంకులు ఈ జాబితాను తయారుచేయడంపై ఆర్‌బీఐ గతంలో నిషేధం విధించింది. కానీ కమర్షియల్‌ బ్యాంక్‌ల నుంచి ఒత్తిడి రావడంతో ఈ ఏడాది జూన్‌లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.