కొత్త సంవత్సర వేడుకలకు భారీ బందోబస్తు

మహిళల భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి
బెంగళూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరు పోలీసలుఉల గట్టి ఏర్పాట్లను చేస్తున్నారు. నగరంలో నడిరోడ్డుపైనే అమ్మాయిలను యువకులు లైంగికంగా వేధించిన ఘటన నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సిసి కెమెరాల ఏర్పాటుకు ఆదేశించారు. భారీగా పోలీసులను మొహరించి బందోబస్తు చేపట్టబోతున్నారు. కొత్త ఏడాదికి మరో నాలుగైదు రోజలే ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డిసెంబరు 31 న  కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనే మహిళలపై లైంగిక వేధింపుల నివారణ కోసం ప్రత్యేకంగా రోడ్డుపై బారికేడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలోని బ్రిగేడ్‌ రోడ్డు, ఎంజీరోడ్లపై తమను లైంగికంగా వేధించారని గత ఏడాది పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం రోడ్లపై ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయడంతోపాటు మగతోడు లేకుండా ఉత్సవాలకు రావద్దని పోలీసులు సూచించారు. ఈ ఏడాది వేడుకల్లో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు వ్యాపారుల సంఘాలు, పౌరుల సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. అలాగే ఈయేడు ఎలాంటి ఘటనలు జరిగినా చర్యలు తీసుకుంటామని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పౌరులు అతిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.